UPDATES  

NEWS

 సంక్షేమ పథకాలపై అమల్లో కీలక మార్పులు..!

ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనా పరంగా కీలక సంస్కరణలకు సిద్దమవుతోంది. రానున్న కాలంలో సంక్షేమం – అభివృద్ధి కొనసాగింపులో కార్యాచరణ డిసైడ్ చేయనున్నారు. అయిదేళ్ల కాలంలో పాలనా పరంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలో జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం విస్తృత సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తన ఆలోచనలు, కూటమి ప్రభుత్వ విధానాలను వారికి వివరించి దిశానిర్దేశం చేయనున్నారు.

 

కలెక్టర్ల సమావేశం పెట్టుకొని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం అమలు చేయాలనుకున్న బహుముఖ వ్యూహాన్ని కలెక్టర్లు, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులతో చర్చించి దాని అమలుకు కార్యాచరణను ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రిగా 1995 నాటి మోడల్‌ను అమలు చేస్తానని ఇప్పటికే చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పరిపాలనలో గుణాత్మకమైన మార్పు తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. చంద్రబాబు అంటే కేవలం అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తారన్న విమర్శలకు దీటుగా బదులివ్వడానికి సన్నద్ధమవుతున్నారు.

 

చంద్రబాబు దిశా నిర్దేశం పేదలే లక్ష్యంగా సంక్షేమం అందించేలా ఇప్పటికే సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చే స్తున్నారు. ప్రతీ పేద కుటుంబంలోని లబ్ధిదారులకు ఒకటో తేదీనే ఫించను సొమ్ము అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇలా కుటుంబంలో వ్యక్తిని ఒక యూనిట్‌గా తీసుకొని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేలా సంక్షేమ కార్యాచరణను రూపొందించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికీ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పేదల సంక్షేమానికి వివిధ పథకాల ద్వారా రూ.వేల కోట్లు ఖర్చుపెట్టబోతున్నారు. ఈ ఖర్చు నిజంగా వారికి మేలు చేస్తుందా.. లేదా.. ఇంకా ప్రజలకు మేలు చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది.. పేదరిక నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లతో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడనున్నారు.

 

సత్ఫలితాలే లక్ష్యంగా మరోవైపు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని సామాజిక సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలని భావిస్తున్నారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమంతో పాటు రక్షిత తాగునీరు, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడం, కూలీలు, కార్మికులకు ఉపాధి కల్పన, రహదారుల నిర్మాణం, పాఠశాలలను సమర్థంగా నిర్వహించడం, భూ వివాదాల పరిష్కారం, ప్రభుత్వ భూముల పరిరక్షణ.. వంటి సామాజిక ప్రయోజనాలు లక్ష్యంగా గ్రామాలను ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు యోచిస్తున్నారు. సత్ఫలితాలే లక్ష్యంగా పనిచేసేలా వారికి సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |