UPDATES  

NEWS

 ఆర్టీసీ బస్సుల్లో ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ..?

రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్పప్పటికీ వాటిని నియంత్రించలేకపోతున్నారు. దీంతో ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. కొద్ది రోజుల క్రితం షామీర్ పేట్‌ వద్ద ఓ కారు రోడ్డుకు ఇవతలవైపునకు దూసుకొచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన సంఘటన గుర్తు ఉండే ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలు ఇకపై జరగకుండా ఉండేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగించేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

 

రోడ్డు ప్రమాదాలకు చెక్

 

రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందుగానే అలర్ట్ చేసే అడ్వాన్డ్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ADAS)టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీని తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో వినియోగించాలని ఆ సంస్థ యాజమాన్యం భావిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలర్ట్ సిస్టంను 200 ఆర్టీసీ బస్సుల్లో అమర్చి ఫలితాలను సమీక్షించారు. ఏడాదిలో దాదాపుగా 40శాతం మేరా రోడ్డు ప్రమాదాలు తగ్గినట్లుగా గుర్తించారు.

 

జాతీయ రహదారులపై నిత్యం వందల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలోనే ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతుంటాయి.ముఖ్యంగా హైదరాబాదు-బెంగళూరు, హైదరాబాదు – విజయవాడ, హైదరాబాదు-నాగ్‌పూర్ జాతీయ రహదారులపై ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో 2022 సెప్టెంబరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అమర్చారు. 2023 మార్చి నుంచి 2024 ఏప్రిల్ మధ్య చాలా వరకు ఈ మూడు జాతీయ రహదారులపై ఆర్టీసీ బస్సులు ప్రమాదంకు గురికావడం 40శాతం తగ్గినట్లు గుర్తించారు.

 

ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది..

 

ఐఐఐటీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న INAI నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం, ఇంటెల్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి రోడ్డు ప్రమాదాలను అరికట్టడంపై పనిచేస్తున్నాయి. భారత్‌లో రోడ్డు ప్రమాదాలను తగ్గించే క్రమంలో పైలట్ ప్రాజెక్టు కింద ఇంటెల్ సంస్థకు చెందిన మొబిల్ఐ అడాస్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. వాహనం యొక్క విండ్ షీల్డ్‌కు కెమెరాను అమరుస్తారు.ఇది ముందున్న రహదారిని మొత్తం స్కాన్ చేస్తుంది.ఆ పై ముందుగానే ప్రోగ్రామింగ్ చేయబడ్డ ఆల్గరిథమ్ అనుసరించి రహదారిపై ఏమైనా ప్రమాదం పొంచి ఉంటే అలర్ట్ చేస్తుంది. ఏదైనా వాహనాన్ని ఢీకొట్టే ప్రమాదం ఉందని పసిగడితే వెంటనే ఆడియో రూపంలో, వీడియో రూపంలో డ్రైవర్‌ను అలర్ట్ చేస్తుంది. తద్వారా డ్రైవర్ జాగ్రత్త పడతాడు.

 

ఉదాహరణకు ముందున్న వాహనంకు అత్యంత దగ్గరగా డ్రైవర్ తన వాహనాన్ని తీసుకెళితే, వెంటనే ఒక వార్నింగ్ డ్రైవర్‌కు ఆడియో రూపంలో వెళుతుంది. దీంతో ఆయన జాగ్రత్తపడి ముందున్న వాహనంకు తన వాహనంకు కాస్త దూరాన్ని మెయిన్‌టెయిన్ చేస్తాడు. అంతేకాదు రహదారిపై ఉన్న పాదచారులను, సైక్లిస్టులు,లేదా ఏవైనా జంతువులు ఉన్న ఒక హెచ్చరిక వెళుతుంది. దీంతో ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలున్నాయి.ఒకవేళ ఎలాంటి సిగ్నల్ వేయకుండా ఉన్న లేన్ నుంచి పక్క లేన్‌లోకి వాహనం వెళితే కూడా అలర్ట్ వెళుతుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి స్థాయి రిపోర్టు ఇంకా విడుదల కావాల్సి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ టెక్నాలజీకి ఆమోదం తెలిపితే వెంటనే టెండర్లకు ఆహ్వానించే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ADAS టెక్నాలజీని తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో అమర్చి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |