UPDATES  

NEWS

 కౌలు రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!

ఏపీలో కౌలు రైతులకు కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. గత పాలనలో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతు చట్టాన్ని రద్దు చేసి దాని స్ధానంలో మెరుగైన పాత కౌలు రైతు చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు వ్యవసాయమంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ కీలక ప్రకటన చేశారు. విజయవాడలో నిర్వహించిన ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ మేరకు కౌలు రైతు చట్టం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

 

ఏ ప్రభుత్వానికైనా, ప్రజలకైనా వ్యవసాయం, సహకార సంఘాలు అత్యంత ప్రాధాన్యమైనవని, ఈ రంగాలు లేని సమాజాన్ని ఊహించలేమని అచ్చెన్నాయుడు తెలిపారు. 2019లో వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన కౌలు రైతు చట్టాన్ని రద్దు చేసి 2016లో అప్పటి టీడీపీ సర్కార్ చేసిన చట్టాన్ని అమలు చేస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. భూ యజమాని అంగీకారం ఉంటేనే కార్డు ఇవ్వాలని మెలిక పెట్టడంతో, గతంలో వచ్చిన ప్రయోజనాలు కూడా అందక రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రతి కౌలు రైతుకు బ్యాంక్‌ రుణాలు, ప్రభుత్వ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

సహకార వ్యవస్థలో ఈ-కేవైసీ అమలు చేసి పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి రుణాలు అందించాలని, చిట్టచివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు. కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలను తీర్చిదిద్దాలని, నూతన సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

 

సొంత రైతులే వ్యవసాయాన్ని వదిలేస్తున్న నేపథ్యంలో, సాగు బాధ్యతను కౌలు రైతులే తీసుకుంటున్నారని అచ్చెన్న తెలిపారు. రాష్ట్రంలో 90 శాతానికిపైగా కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారన్నారు. సీసీఆర్‌సీ పేరిట అనాలోచిత చట్టాన్ని తెచ్చి అన్నదాతలను గత ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. సీసీఆర్‌సీ కార్డులు రాక, ప్రభుత్వ ప్రయోజనాలు అందక, రైతులు కష్టాల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాకతో రైతాంగానికి మళ్లీ మంచిరోజులు రావాలని, వ్యవసాయానికి ఊతమిచ్చేలా సహకార వ్యవస్థ పనిచేయాలన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |