అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత యావత్ ప్రపంచ దృష్టి భారత సంప్రదాయాలపై పడింది. రాముని భక్తులు ఇప్పుడు ప్రపంచ నలుమూలలా విస్తరిస్తున్నారు. రాముడు అనగానే ఏకపత్నీ వృతుడు, పితృవాక్య పరిపాలకుడు , ఆదర్శ పురుషుడు అని వేనోళ్ల పొగుడుతుంటారు. తెలుగు రాష్ట్రాల పల్లెలలో రామాలయం లేని ఊరు ఉండదంటే ఆశ్చర్యం కలగక మానదు. రాముడంటే ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో ఎంతో భక్తి. అటువంటి రాముడిపై తమిళనాడు డీఎంకే నేత నోరుపారేసుకున్నాడు. తమిళనాడు రాష్ట్ర మంత్రి ఎస్ఎస్ శివశంకర్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాముడి చరిత్ర ఏది?
రాముడు అనే వ్యక్తి గురించి కనీసం చారిత్రక ఆధారాలు లేవని..ఆయన ఉనికి ప్రస్తావనే లేదని అలాంటప్పుడు ఆయన దేవుడెలా అవుతాడు, చారిత్రక పురుషుడు అవుతాడని వ్యాఖ్యానించారు. అరియలూర్ లో రాజేంద్ర చోళుడి జయంతిని అక్కడ ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక అతిథిగా డీఎంకే మంత్రి ఎస్.ఎస్.శివశంకర్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజేంద్ర చోళుడు చోళ సామ్రాజ్యాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని, ఇక్కడి శిల్పసంపద, గొప్ప నిర్మాణాలు, చోళుల పాలనా దక్షత చూసి ప్రపంచమే దాసోహం అయిందని..చోళులలోనే అత్యంత ఘనత వహించిన రాజేంద్ర చోళుడి గురించి చరిత్ర ప్రస్థావ, ఆధారాలు ఉన్నాయని అన్నారు.
ఓట్ల కోసమే మత రాజకీయం
రాముడు అయోధ్య పాలించాడనడానికి ఆధారాలేమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఆయనే లేనప్పుడు ఆయన ఉనికి ఎందుకుంటుంది? అన్నారు. బీజేపీ ఓట్ల కోసం హిందూ మతాన్ని వాడుకుంటోందని, కల్పితమైన రాముడి గాథలను ప్రచారం చేసుకుంటోందని తీవ్ర విమర్శలు చేశారు. మొత్తం చరిత్రనే వక్రీకరించే ప్రయత్నాలు చేస్తూ లేని నిజాన్ని ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు.అయితే రాముడి గురించి గతంలో డీఎంకే అధినేత కరుణానిధి కూడా అప్పట్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. రామసేతు అసలు కల్పితం అని..ఆ నిర్మాణం అభూత కల్పన అని అన్నారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇప్పుడు కూడా డీఎంకే మంత్రి రాముడి మీద అలా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నేతలు ఆగ్రహింతో రగిలిపోతున్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే మంత్రి వ్యాక్యలను ఖండించారు.
రామసేతు విషయంలోనూ..
రాముడి మీద అలా నోరుపారేసుకోవడం డీఎంకే నేతలకు కొత్తేమీ కాదని..గతంలోనూ డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి రామసేతు విషయంలో అవాకులు చవాకులు పేలారని..డీఎంకే మంత్రి హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా మాట్లాడటం భావ్యం కాదని అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. డీఎంకే నేతల జ్ణాపకాలు ఇలా మసకబారుతాయని, చవకగా ఉంటాయని ఎవరూ ఊహించలేదని అన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో చోళ రాజదండం ఏర్పాటు చేయడం మర్చిపోవద్దని అన్నారు. అప్పట్లో ఈ రాజదండం గురించి డీఎంకే నేతలు నానా రభసా చేశారు. రాజదండం ఏర్పాటు చేయకూడదని మోదీని హెచ్చరించారు. అలాంటి నేతలకు ఇవాళ చోళుల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ప్రజలు కూడా డీఎంకే విధానాలను వ్యతిరేకిస్తున్నారని..రామడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించరని అన్నారు.