ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మెట్రో రైల్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే మెట్రో రైల్ కు కొత్త ఎండీని నియమించింది. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ ఎండీగా రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. రామకృష్ణారెడ్డి గతంలో కూడా ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. ప్రస్తుతం ఎండీగా ఉన్న జయమన్మథరావును రిలీవ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
అయితే, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో రైలు ఏర్పాటు కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సి ఉన్నది. రాష్ట్ర విభజన అనంతరం 2015 అక్టోబర్ 29న ఏపీ ప్రభుత్వ సంస్థగా ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటయ్యింది. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు అభివద్ధే దీని లక్ష్యం. ఆ తరువాత విజయవాడ మెట్రోను అమరావతి వరకూ పొడిగించాలని ప్రణాళికను సిద్ధం చేశారు.
గతంలో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ మెట్రో రైలు ప్రతిపాదనను చంద్రబాబు పట్టాలెక్కించారు. 2 కారిడార్లలో మెట్రో రైలు నిర్మాణానికి ప్రతిపాదనలను, డీపీఆర్ లను తయారు చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను కూడా కేంద్రానికి ప్రతిపాదించారు. అయితే, కేంద్రం వాటిని తిరస్కరించింది. దీంతో లైట్ మెట్రో ప్రాజెక్టు పేరుతో చేసిన ప్రయత్నం ముందుకు సాగలేదు. అప్పటి నుంచి ఇక ముందుకు సాగలేదు. అయితే, తాజా నియామకంతో ఈ ప్రతిపాదనలు పట్టాలెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.