తెలంగాణ అసెంబ్లీ కొద్దిసేపు దద్దరిల్లింది. హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. మొదటగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చర్చను ప్రారంభించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి పరుష పదజాలం ఉపయోగించారంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. అనంతరం స్పీకర్ పోడియం వైపు దూసుకొచ్చారు. ప్రతిగా దానం కూడా పోడియం వైపు దూసుకువెళ్లారు. దీంతో ఆయనను కాంగ్రెస్ సభ్యులు ఆయనను వెనక్కి తీసుకెళ్లారు. దీంతో కొద్దిసేపు సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
దానం నాగేందర్ కు మాట్లాడే అవకాశం ఇవ్వడంపై నిరసనగా ఎమ్మెల్యే కేటీఆర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీనిపై స్పందించిన స్పీకర్.. దానం నాగేందర్ స్పీచ్ లో అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలు ఉంటే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు.
ఇదిలా ఉంటే.. ఆ తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ వారు పేర్కొన్నారు.