లైగర్ సినిమాతో పూరి జగన్నాథ్ ఎన్ని వివాదాల బారిన పడ్డాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా హిట్ అయితే ఈ వివాదాల గురించి మాట్లాడుకొనే పనే ఉండేది కాదేమో. లైగర్.. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే కాదు.. పూరి జగన్నాథ్ కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక దీంతో లైగర్ డిస్ట్రిబ్యూటర్లు అందరూ.. తమకు న్యాయం చేయాలనీ పూరిపై విరుచుకుపడిన సంగతి కూడా తెల్సిందే.
నిజం చెప్పాలంటే.. ఈ సినిమాకు పూరి- ఛార్మీ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ కాంబో నుంచి అంతకు ముందు ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్ సినిమా రావడంతో.. లైగర్ పై బయ్యర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు బయ్యర్లు నష్టపోతే.. నిర్మాతలు డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. మంచి మనసున్న నిర్మాతలు అయితే.. బయ్యర్ల నష్టాన్ని కొద్దిగా తీర్చేవారు. అయితే ఇక్కడ కథ వేరుగా ఉంది. లైగర్ మూవీ థియేట్రికల్ హక్కులను వరంగల్ శ్రీను తో పాటు చదలవాడ శ్రీనివాసరావు, శోభన్, తదితరులు కొనుగోలు చేశారు.
ఇక మేకర్స్.. అతని మీద ఉన్న నమ్మకంతో నే రిటర్న్ అగ్రిమెంట్ చేసుకున్నారు. వరంగల్ శ్రీను అంతకుముందు ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. రెగ్యులర్ బయ్యర్ కూడా కాదు. దీంతో అతనికి అడ్వాన్స్ లు ఇచ్చి చేతులు కాల్చుకున్న ఎగ్జిబిటర్లు అందరూ.. మా డబ్బులు మాకు ఇవ్వండి అని మేకర్స్ పై ఒత్తిడి తెచ్చారు. ఇక పూరి సైతం కొంతవరకు నెమ్మదిగా సర్దిచెప్పాలని చూసినా వారు వినకపోవడంతో పోలీస్ కేస్ వరకు వెళ్ళింది.
ఇక అక్కడితో ఆ గొడవ ఆగిపోయిందని అనుకున్నారు. కానీ, ఇప్పుడు పూరి కొత్త చిత్రం డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కు రెడీ అవుతున్న వేళ.. లైగర్ బయ్యర్లు మరోసారి బయటకు వచ్చారు. తమ నష్టాన్ని పూడ్చి.. సినిమాను రిలీజ్ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీంతో బయ్యర్లతో మాట్లాడడానికి పూరి- ఛార్మీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలో ఉన్న వీరు హైదరాబాద్ కు బయల్దేరుతున్నారని టాక్. మరి ఈసారైనా ఈ వివాదం ముగుస్తోందా.. ? లేక డబుల్ ఇస్మార్ట్ కు ఈ వివాదం కొత్త సమస్యను తెస్తుందా.. ? అనేది చూడాలి.