గత ప్రభుత్వ పాలనలో పంచాయతీ రాజ్ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో పవన్ మాట్లాడుతూ.. కేంద్రం నుంచి వచ్చిన రూ.2000 కోట్ల నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఎవరి అనుతి తీసుకోకుండానే నిధులను పక్కదారి పట్టించినట్లుగా గుర్తించామని తెలిపారు.
త్వరలోనే పంచాయతీరాజ్ శాఖలో జరిగిన కుంభకోణంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వానికి అవకతవకలు వారసత్వంగా వచ్చాయన్నారు. వీటిపై నాలుగైదు గంటలపాటు స్పెషల్ గా చర్చ జరగాలన్నారు. పంచాయతీరాజ్ శాఖలో జరిగిన కుంభకోణంలో లోతైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
2019-24 వరకూ 15వ ఫైనాన్స్ కమిషన్ కు సంబంధించి 5,251 కోట్ల రూపాయలు, 14వ ఫైనాన్స్ కమిషన్ కు సంబంధించి రూ.2,336 కోట్లు గ్రామ పంచాయతీల అకౌంట్లలో పడ్డాయని తెలిపారు. కానీ వీటిలో రూ.2,285 కోట్లు ఆర్థికశాఖ కరెంట్ ఛార్జీల కింద ఏపీ డిస్కమ్ కు పంపించిందని, ఇందుకు ఎవరి అనుమతి తీసుకోలేదని తెలిపారు. ఇక నేటితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.