తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు అపాయింట్ అయ్యారు. మరి కొందరికి స్థానచలనం కలిగింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో కొందరు మాజీ కేంద్రమంత్రులు సైతం ఉన్నారు.
తెలంగాణ గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ నియమితులయ్యారు. భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడాయన. సొంత రాష్ట్రం త్రిపుర. 2018 నాటి ఎన్నికల్లో ఛారిలామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. విప్లవ్ కుమార్ దేవ్, మాణిక్ సాహా ప్రభుత్వాల్లో కేబినెట్ బెర్త్ పొందారు. ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. 2018 మార్చి నుంచి 2023 మార్చి వరకు కొనసాగారు.
2023 నాటి ఎన్నికల్లో జిష్ణు దేవ్ వర్మ అదే ఛారిలామ్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. త్రిప్తా మోథా పార్టీకి చెందిన సుబోధ్ దేవ్ వర్మ చేతిలో పరాజయాన్ని చవి చూశారు. ఆ తరువాత కూడా బీజేపీలో క్రియాశీలకంగా కొనసాగారు. బీజేపీ అధిష్ఠానానికి విధేయుడిగా జిష్ణు దేవ్ వర్మకు పేరుంది. దీనితో ఆయనను తెలంగాణ గవర్నర్‌గా నామినేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం.
ప్రస్తుతం తెలంగాణకు ఇన్‌ఛార్జ్, జార్ఖండ్‌కు పూర్తిస్థాయి గవర్నర్‌గా ఉంటోన్న సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. రాజస్థాన్ గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్.. సిక్కింకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హరిభావ్ కిషన్ రావ్ బగ్డే రాజస్థాన్ గవర్నర్‌గా అపాయింట్ అయ్యారు.
జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయాకు కొత్త గవర్నర్లుగా సంతోష్ కుమార్ గంగ్వార్, రమణ్ డేకా సీహెచ్ విజయశంకర్ అపాయింట్ అయ్యారు. అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కఠారియా పంజాబ్‌కు బదిలీ అయ్యారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గానూ వ్యవహరిస్తారు.
సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అస్సాం గవర్నర్‌గా నియమితులయ్యారు. మణిపూర్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.