UPDATES  

NEWS

 బీజేపీలో హరీష్ రావు చేరికపై తేల్చేసిన ఈటల..!

భారత్ రాష్ట్ర సమితి.. అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పతనావస్థకు చేరుకుంది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన తరువాత.. కోలుకోలేకపోతోంది. ఇటీవలి కాలంలో ఆ పార్టీలో చోటు చేసుకుంటోన్న పరిణామాలే దీనికి నిదర్శనం.

 

లోక్‌సభలో జీరో..

 

మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిందీ గులాబీ పార్టీ. ప్రస్తుతం లోక్‌సభలో బీఆర్ఎస్‌కు ఎలాంటి ప్రాతినిథ్యం లేదు. పోటీ చేసిన 17 చోట్లా ఆ పార్టీ అభ్యర్థులు మట్టికరిచారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ తలో ఎనిమిది సీట్లను సాధించాయి. హైదరాబాద్‌ స్థానాన్ని ఎంఐఎం నిలబెట్టుకుంది.

 

వలసలు, కేసులూ..

 

అటు రాజకీయంగా, ఇటు కుటుంబపరంగా బీఆర్ఎస్ గతంలో ఎప్పుడూ లేనంతగా విలవిల్లాడుతోంది. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలుపాలయ్యారు. దేశ రాజకీయాలను ఒక కుదుపు కుదిపిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు. తీహార్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. అటు వలసలు సైతం బీఆర్ఎస్‌ను పట్టి పీడిస్తోన్నాయి.

 

స్పందించిన ఈటల

 

ఈ పరిణామాలన్నింటిపైనా కేసీఆర్ ఒకప్పటి కుడిభుజం ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పిన తరువాత ఆయన కాషాయ కండువాను కప్పుకొన్న విషయం తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో ప్రతిష్ఠాత్మక మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఇది- రేవంత్ రెడ్డి సొంత లోక్‌సభ స్థానం.

 

కేసీఆర్ వైఖరే..

 

వన్ ఇండియా తెలుగుకు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఈటల మాట్లాడారు. బీఆర్ఎస్ ఈ స్థాయిలో పతనం కావడానికి గల కారణాలను విశ్లేషించారు. దీనికి- కేసీఆర్ వైఖరే కారణమని తేల్చి చెప్పారు. 2014లో అన్ని వర్గాల ప్రజల త్యాగాల పునాదులతో అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్‌లో అహంకారం, స్వార్థ బుద్ధి విపరీతంగా పెరిగిపోయిందని, తానే తెలంగాణను సాధించానని, తనను తాను ఓ దేవదూతగా అభివర్ణించుకున్నారని పేర్కొన్నారు.

 

మనుషుల్లాగా చూల్లేదు..

 

తనతో కలిసి 14 సంవత్సరాల పాటు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న వారిని కేసీఆర్ అవమానించారని, వారిని కనీసం మనుషుల్లాగా కూడా చూడలేదని ఈటల అన్నారు. సర్వం తాను, తన కుటుంబమేనని, ఓ 30,40 సంవత్సరాల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, తనను ఎవరూ కదలించలేరనే అహంభావం కేసీఆర్‌లో పెరిగిందని చెప్పారు.

 

ఒక్క కలం పోటుతో..

 

కేసీఆర్ హయాంలో జీతాల కోసం 1,700 మంది మున్సిపల్ కార్మికులు ఆందోళనలకు దిగితే- ఒక్క కలం పోటుతో వారినందరినీ ఉద్యోగాల నుంచి తొలగించారని ఈటల గుర్తు చేశారు. అలాగే- ఆర్టీసీ ఉద్యోగులను కూడా అదే రకంగా ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. పార్టీలో సీనియర్లే కాకుండా.. చిరు ఉద్యోగులు కూడా ఛీత్కారానికి గురయ్యారని అన్నారు.

 

ఏ పార్టీ అయినా..

 

తాను ఏరికోరి బీజేపీలో చేరడానికి గల కారణాలను ఈటల వివరించారు. పార్టీ ఏదయినా దేశ సమగ్రాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తాయని, ఉన్నంతలో ప్రజల నిజమైన అవసరాలను గుర్తించడమే కాకుండా సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడం, దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచ చిత్రపటంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారని, అందుకే తాను బీజేపీని ఎంచుకున్నానని తెలిపారు.

 

కాంగ్రెస్ ఎందుకు గెలిచిందంటే..?

 

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంపైనా ఈటల తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. బీఆర్ఎస్- బీజేపీ ఒక్కటేనంటూ కాంగ్రెస్ విషప్రచారం చేసిందని చెప్పారు. దానికితోడు మద్యం పాలసీ కుంభకోణంలో దోషులను అరెస్ట్ చేయట్లేదనే భావన ప్రజల్లో నెలకొందని, ఫలితంగా బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌కు ఓటు వేశారని అన్నారు. ఇది కేసీఆర్ ఓటమే తప్ప కాంగ్రెస్ గెలుపు కాదని వ్యాఖ్యానించారు.

 

ఆరునెలలకే వ్యతిరేకత..

 

ఆరు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని ఈటల అన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయగలిగే సత్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదని చెప్పారు. రేవంత్‌ మంత్రిగా పని చేసిన అనుభవమైనా లేదని, అలాగని- సీనియర్ల సలహాలను కూడా తీసుకుంటోన్నట్టుగా కనిపించట్లేదని ఈటల పేర్కొన్నారు.

 

మంత్రలకే సమాచారం లేదు..

 

పీర్జాదిగూడలో ఇళ్ల కూల్చివేతపై రెవెన్యూ మంత్రికే సమాచారం లేదని ఈటల ఎద్దేవా చేశారు. ఉప ముఖ్యమంత్రి అయినా కూడా భట్టి విక్రమార్క వద్ద సైతం సమాచారం లేదని చెప్పారు. ఇక్కడ కూడా సర్వం తాననేనే భావన నెలకొని ఉందని వ్యాఖ్యానించారు.

 

వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..

 

తెలంగానలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేననే అభిప్రాయం ప్రజల్లో ఉందని, దాన్ని విజయంగా మలచుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని ఈటల అన్నారు. దానికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటామని చెప్పారు. అసెంబ్లీతో పోల్చుకుంటే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా ఓట్ షేర్‌ను పెంచుకున్న రాష్ట్రం తెలంగాణేనని పేర్కొన్నారు.

 

సొంత కాళ్ల మీదే..

 

తెలంగాణలో బీజేపీ తన సొంత కాళ్ల మీదే నిలబడుతుందని ఈటల స్పష్టం చేశారు. సొంతంగా పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేయాలనే పంథా తమది కాదని చెప్పారు. చేరికల విషయంలో పార్టీకి కొన్ని కండీషన్లు ఉన్నాయని, వాటికి ఓకే ఎవరైనా చేరొచ్చని చెప్పారు.

 

బీజేపీలో హరీష్ రావు చేరికపై..

 

బీజేపీలో మాజీమంత్రి హరీష్ రావు చేరికపై ఈటల స్పందించారు. ఈ విషయంపై ఆయన ఆలోచన చేస్తుండవచ్చు అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని, హరీష్ రావు చేరికపై ఇప్పుడున్న పరిస్థితుల్లో తానేమీ కామెంట్ చేయలేనని చెప్పారు. రేవంత్ రెడ్డి సొంతకుంపటి పెట్టుకునేలా వ్యవహరిస్తోన్నారని పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |