రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం.. పండగ వాతావరణంలో ఆరంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన తొలి కార్యక్రమం, అమలు చేసిన తొలి హామీ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా ప్రారంభించారు. రాజధాని అమరావతి పరిధిలోని పెనుమాకలో కొద్దిసేపటి కిందటే స్వయంగా అర్హులకు వాళ్ల ఇళ్ల వద్దే పింఛన్ మొత్తాన్ని అందజేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. మేళ తాళాలు, డప్పు చప్పుళ్లతో పెనుమాకలో కోలాహలం నెలకొంది.
రాష్ట్రవ్యాప్తంగా 65.31 లక్షలమంది వయోధిక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్ మొత్తాన్ని ఇదివరకే పెంచింది చంద్రబాబు ప్రభుత్వం. పింఛన్ కింద గత ప్రభుత్వం 3,000 రూపాయలను చెల్లించగా.. ప్రస్తుతం ఈ మొత్తం 4,000 రూపాయలకు చేరింది.
పెంచిన పింఛన్ మొత్తం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలయింది. అంటే- ఏప్రిల్, మే, జూన్ నెలలకు గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన 3,000 రూపాయలకు అదనంగా మరో వెయ్యి రూపాయలను కలిపింది. ఇక ఈ నెలలో చెల్లించాల్సిన 4,000లకు కొత్తగా ఏప్రిల్, మే, జూన్ నుంచి అందాల్సిన వెయ్యి రూపాయలతో కలిపి మొత్తం 7,000 రూపాయలను అర్హులైన లబ్దిదారులకు మంజూరు చేసింది.
వికలాంగులకు.. గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా 3,000 రూపాయల పింఛన్ అందుతుండగా ఆ మొత్తం రెట్టింపయింది. ఈ మొత్తం కూడా నేటి నుంచే పంపిణీ చేస్తోన్నారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వీల్ ఛైర్‌కు పరిమితమైన వారికి చెల్లించే పింఛన్ మొత్తం కూడా భారీగా పెరిగింది. గతంలో ప్రతి నెలా వారికి 5,000లను ప్రభుత్వం చెల్లిస్తోండగా.. ఇప్పుడది 15,000 రూపాయలకు పెరిగింది.
కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేయించుకున్న వారికి చెల్లించే పింఛన్ మొత్తం 5,000ల నుంచి 10,000 రూపాయలకు పెంచింది ప్రభుత్వం.సామాజిక భద్రత కింద చెల్లించే పింఛన్ల కోసం ప్రభుత్వం ఏకంగా సంవత్సరానికి 33 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనుంది.









