UPDATES  

NEWS

 జియో, ఎయిర్ టెల్ రేట్ల పెంపు వెనుక కారణాలివే..!

దేశంలో రెండు ప్రధాన టెలికాం ఆపరేటర్లు అయిన జియో, ఎయిర్ టెల్ తమ మొబైల్ ప్లాన్స్ ను భారీగా పెంచేశాయి. ఈ మేరకు వరుసగా రెండు రోజుల్లో కీలక ప్రకటనలు చేశాయి. ప్రస్తుతం తాము అందిస్తున్న ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ సేవల ప్లాన్స్ రేట్లను భారీగా పెంచాయి. అయితే హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రెండు కీలక కారణాలు కనిపిస్తున్నాయి. వీటి వల్లే తాము రేట్లను పెంచాల్సి వచ్చిందని ఆయా సంస్థలు చెప్తున్నాయి.

 

జియో తన కొన్ని ప్రీమియం ప్లాన్‌లలో అత్యధికంగా 12-25 శాతం టారిఫ్‌లను పెంచింది. రోజుకు 1.5 GB డేటాతో 28 రోజుల చెల్లుబాటుతో కొనసాగుతున్న తమ యాక్టివ్ ప్లాన్ రేటు అత్యధికంగా 25 శాతం పెరిగింది. అలాగే ఎయిర్‌టెల్ కూడా తమ ప్లాన్ల ధరలను 11-21 శాతం పెంచింది. ఈ రెండు ఆపరేటర్లూ జూలై 3 నుంచి కొత్త ధరలు అమల్లోకి తీసుకురాబోతున్నాయి. దీంతో ఈ రేట్ల భారీ పెంపు వెనుక గల కారణాలపై చర్చ జరుగుతోంది. మరో ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా మాత్రం ఇంకా పెంచలేదు.

 

ఎయిర్ టెల్, జియో మొబైల్ ప్లాన్ల రేట్ల పెరుగుదల వెనుక 5జీ సేవల నాణ్యత పెంపు, ఆర్ధికంగా మార్కెట్లో నిలదొక్కుకోవడం కారణాలుగా తెలుస్తోంది. భారతదేశంలోని టెలికాంలకు ఆర్థికంగా ఆరోగ్యకరమైన వ్యాపార నమూనాను అమలు చేయడానికి, వినియోగదారునికి మొబైల్ సగటు ఆదాయం (ARPU) రూ.300 కంటే ఎక్కువగా ఉండాలని భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది. వాస్తవానికి మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంల ఎయిర్ టెల్ ఏఆర్పీయూ రూ. 209గా ఉంది. ఈ త్రైమాసికంలో జియో ఏఆర్పీయూ రూ. 181.70,, వొడాఫోన్ ఐడియాకు రూ.146 గా ఉంది. వీటిని సరిచేసేందుకు రేట్లను పెంచినట్లు జియో, ఎయిర్ టెల్ సంస్థలు చెప్తున్నాయి.

 

అలాగే దేశంలో 5జీ సేవల్ని ప్రారంభించినప్పటికీ టెలికాం ఆపరేటర్లు వాటికి అదనపు ఛార్జీలేవీ విధించడం లేదు. ఇప్పుడు రేట్ల పెంపుతో ఆయా ఛార్జీలను కూడా అందులో కలిపి వినియోగదారులకు వడ్డిస్తున్నట్లు తెలుస్తోంది. పేరుకి మాత్రం 5 జీ సేవల్లో నాణ్యత పెంపు కోసం ప్లాన్ల రేట్లు పెంచుతున్నట్లు జియో, ఎయిర్ టెల్ చెప్తున్నాయి. అలాగే గతంలో జియో తమ 4జీ సేవలు ప్రారంభించిన కొత్తలో ఉచితంగా అందించింది. దీని ప్రభావం టెలికాం రంగంపై ఎప్పటికీ ఉంటోంది. దీన్ని తగ్గించుకునేందుకు కూడా ఈ రేట్ల పెంపు అవసరమైనట్లు తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |