ఏపీలో గత ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేసి దాని స్ధానంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కూటమి సర్కార్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీ నిర్వహణపై తన తొలి సంతకం చేయగా.. విద్యామంత్రి నారా లోకేష్ దీని విధివిధానాల ఖరారుపై సంతకం చేశారు. అనంతరం కేబినెట్ ఈ రెండు సంతకాలకు ఆమోదం ఇవ్వడంతో పాటు నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
టెట్ నిర్వహణ తో కలిపి డిఎస్సీ నిర్వహణ
రాష్ట్ర కేబినెట్ ఆమోదం మేరకు ఈ నెల 30న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. తాజాగా గతంలో నిర్వహించిన టెట్ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన ప్రభుత్వం.. మెగా డీఎస్సీ కోసం మరోసారి టెట్ నిర్వహిస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగా ఈసారి మెగా డీఎస్సీని టెట్ తో కలిపి నిర్వహించేలా నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన వారికీ ఇందులో అవకాశం ఉంటుంది.
ఈ నెల 30న 16347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. అనంతరం దరఖాస్తుల స్వీకరణ, వాటి పరిశీలన, పరీక్ష నిర్వహణ, దీంతో పాటే టెట్ నిర్వహణకు వీలుగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రతీ జిల్లాలో 80 శాతం పోస్టుల్ని స్థానికులకు ఇచ్చేలా, మరో 20 శాతం నాన్ లోకల్ అభ్యర్ధులకు కేటాయించేలా ఈసారి నోటిఫికేషన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు.









