UPDATES  

NEWS

 డీఎస్సీ అభ్యర్ధులకు ఏపీ కేబినెట్ గుడ్ న్యూస్.

ఏపీలో మెగా డీఎస్సీ నిర్వహణకు వీలుగా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టగానే తొలి సంతకం మెగా డీఎస్సీ నిర్వహణపైనే చేశారు. ఇవాళ విద్యామంత్రి నారా లోకేష్ డీఎస్సీ విధివిధానాలపై సంతకం చేశారు. ఈ రెండు నిర్ణయాలకు ఇవాళ తొలిసారి సమావేశమైన కూటమి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే జూలై 1 నుంచి మెగా డీఎస్సీ నిర్వహణ ప్రక్రియ ప్రారంభించేందుకు పచ్చజెండా ఊపింది.

 

ఇవాళ కేబినెట్ భేటీలో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక చేసిన ఐదు సంతకాలపై ముందుగా చర్చ జరిగింది. ఇందులో తొలి సంతకం చేసిన మెగా డీఎస్సీపై కేబినెట్ ముందుగా చర్చించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణపై రెండు రకాల ప్రతిపాదనలు కేబినెట్ ముందుకు వచ్చాయి. అలాగే డీఎస్సీ నిర్వహణ షెడ్యూల్ ను కూడా అధికారులు కేబినెట్ ముందు ఉంచారు.

 

అనంతరం జులై ఒకటి నుంచి మెగా డీఎస్సీ ప్రక్రియ ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే డిసెంబర్ 10 లోగా 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీని పూర్తి చేసేలా షెడ్యూల్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. జూలై 1న మెగా డీఎస్సీ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఇప్పటికే నిర్వహించిన టెట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలా లేదా అన్న దానిపై క్లారిటీ ఇవ్వబోతున్నారు. గరిష్టంగా ఆరునెలల్లో మెగా డీఎస్సీ నిర్వహణ పూర్తి చేయనున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |