ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా వైఎస్ జగన్ ఉన్నప్పుడు సాధారణ పరిపాలన శాఖ ఆయన అవసరాలకు తగినట్లుగా ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని సమకూర్చింది. ఇప్పుడు అధికారం చేతులు మారడంతో అవన్నీ తిరిగి వస్తాయని భావించినా రాకపోవడంతో ప్రభుత్వం చర్యలకు దిగబోతోంది. ఇందులో భాగంగా ఇవాళ సాధారణ పరిపాలన శాఖ అప్పటి సీఎంవో కార్యదర్శులకు కీలక లేఖ రాసింది.
గతంలో జగన్ పేషీలో కార్యదర్శులుగా వ్యవహరించిన వారితో పాటు సీఎంవో ఇన్ చార్జ్ గా ఉన్న అధికారికి సైతం సాధారణ పరిపాలన శాఖ ఇవాళ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇందులో జీఏడీ.. అప్పట్లో తమకు అప్పగించిన ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని వెంటనే తిరిగి అప్పగించాలని కోరింది. ఇన్వెంటరీ జాబితా ప్రకారం వారికి ఇచ్చినవన్నీ తిరిగి అప్పగించాలని ఈ లేఖలో కోరింది. దీనిపై జగన్ సీఎంవోలో పనిచేసిన అధికారులు స్పందించాల్సి ఉంది.
వాస్తవానికి సచివాలయ బిజినెస్ రూల్స్ ప్రకారం అధికారం కోల్పోయిన 15 రోజుల్లో గతంలో తమకు అప్పగించిన ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని తిరిగి జీఏడీకి అప్పగించాల్సి ఉంది. కానీ వాటిని ఇంకా అప్పగించకపోవడంతో దీనిపై వివాదం నెలకొంది. అయితే వైసీపీ నేతలు మాత్రం తమ వద్ద ఉన్న ఫర్నిచర్ తో పాటు ఇతర వస్తువులకు విలువకట్టి ఎంతయిందో చెప్తే చెల్లించేస్తామని చెబుతున్నారు. దీనిపై జీఏడీ ఏమంటుందో చూడాల్సి ఉంది.
గతంలో వైసీపీ అధికారంలోకి రాగానే అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో స్పీకర్ గా వ్యవహరించిన కోడెల శివప్రసాద్ విషయంలో ఎలాంటి కనికరం చూపకుండా ఫర్నిచర్ ఎత్తుకుపోయారంటూ వేధింపులకు దిగడం, ఆ క్రమంలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో ఇప్పుడు టీడీపీ నేతలు కూడా జగన్ కో న్యాయం, కోడెలకో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీఏడీ లేఖకు ప్రాధాన్యం ఏర్పడింది.









