ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం అయ్యారు. అరగంట పాటు వారిద్దరి మధ్య చర్చలు సాగాయి. జీ7 సభ్య దేశాల సమ్మిట్‌లో భాగంగా ఈ భేటీ ఏర్పాటైంది. అంతకుముందు మోదీ- ఇటలీ ప్రధాని మెలోనీ, ఫ్రాన్స్, ఉక్రెయిన్ అధ్యక్షులు ఇమ్మానుయెల్ మాక్రాన్, వొలొదిమిర్ జెలెన్‌స్కీ, లను కలిశారు.
మోదీ ప్రస్తుతం ఇటలీలో పర్యటిస్తోన్నారు. జీ7 సమ్మిట్‌లో పాల్గొనడానికి ఇటలీలోని అపూలియాకు వెళ్లారు. మూడో విడత ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత ఆయన చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే.
జీ7లో భారత్‌కు సభ్యత్వం లేదు. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్.. మాత్రమే ఇందులో కొనసాగుతున్నాయి. ప్రత్యేక ఆహ్వానితుడిగా భారత్ తరఫున మోదీ ఇందులో పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో ఉక్రెయిన్ అధ్యక్షులు వొలొదిమిర్ జెలెన్‌స్కీ, ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరాస్, యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సుల వాన్ డెర్ ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైెడెన్, బ్రిటన్, కెనడా, జపాన్ ప్రధానమంత్రులు రిషి సునాక్, జస్టిన్ ట్రూడో, ఫ్యుమియో కిషిడ, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ ష్కాల్జ్ ఈ సమ్మిట్‌కు హాజరయ్యారు. ఆతిథ్యాన్ని ఇస్తోన్న ఇటలీ ప్రధాని మెలోనీ దీనికి అధ్యక్షత వహించారు. జీ7 సైడ్ లైన్స్‌లో భాగంగా ప్రధాని మోదీ.. ఆయా దేశాల ప్రధానులతో సమావేశం అయ్యారు. ఆంటోనియో గ్యుటెరాస్‌తో భేటీ అయ్యారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సుమారు అరగంట పాటు చర్చలు జరిపారు. భారత్- అమెరికా మధ్య గల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ప్రస్తావనకు వచ్చాయి. అదే సమయంలో హెచ్1 బీ విసా కోటా పెంపు అంశాన్ని సైతం మోదీ ప్రస్తావించినట్లు చెబుతున్నారు. గతంలో ఈ కోటాను పెంచుతామంటూ అమెరికా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
భారత్‌లో గ్రీన్ ఎనర్జీ, రక్షణ రంగ పరికరాలు, ఎలక్ట్రిక్ కార్ల తయారీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను మోదీ ఈ సందర్భంగా జో బైడెన్‌కు వివరించారు. వివిధ రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి మాట్లాడారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపైనా జో బైడెన్ తన అభిప్రాయాలను మోదీకి వివరించారు.