ఎట్టకేలకు ఏపీ రాజధాని అమరావతిలో ఆగినపోయిన పనులకు మళ్లీ శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. లింగాయపాలెంలో సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయానికి పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.
శనివారం ఉదయం పనులకు శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. రూ. 230 కోట్లతో ఏడు అంతస్తుల్లో కార్యాలయ నిర్మాణం జరగనుంది. నాలుగు నెలల్లో అందుబాటులోకి రానుంది సీఆర్డీఏ ఆఫీసు. ఆంధ్రప్రదేశ్‌లో సీఆర్డీఏ ఆఫీస్ ది బెస్ట్‌గా ఉండాలన్నారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. బెజవాడ వరదలకు అమరావతి మునిగిందని జగన్, ఆయన గ్యాంగ్ తప్పుడు ప్రచారం చేసిందని దుయ్యబట్టారు. నిన్న బెంగుళూరు వరదల్లో జగన్ కట్టుకున్న యలహంకా ప్యాలెస్ మునిగిపోయిందన్నారు.
దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. ఒకరు నాశనం అవ్వాలని కోరుకుంటే.. మనమే నాశనం అవుతామని గుర్తు పెట్టుకోవాలన్నారు. గడిచిన ఐదేళ్లలో అందరికంటే ఎక్కువ బాధ పడింది అమరావతి మహిళలేనని గుర్తు చేశారు. రాణి రుద్రమదేవి కంటే పోరాడిన మహిళా రైతులను అభినందించారు.
ఈ వారంలో భారీ వర్షాలు బెంగుళూరును ముంచెత్తాయి. ఆ సమయంలో తాడేపల్లిలో ఉన్నారు మాజీ సీఎం జగన్. యెలహంకాలో కుంభవృష్టి కురిసింది. ఫోనెక్స్ మాల్, కాలిఫోర్నియా గార్డెన్స్, కేంద్రీయ విహార్ వంటివి మునిగిపోయాయి. యలహంకా లోతట్టు ప్రాంతం భరత్‌నగర్‌లో రోడ్లపై ఇంకా వరద ఉంది. ఆ ప్రాంతంలో జగన్ ప్యాలెస్ ఉంది. దీన్ని గమనించిన సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తోంది.