UPDATES  

NEWS

 పార్లమెంట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్..!

లోక్ సభ ఎన్నికల తర్వాత తొలి పార్లమెంట్ సమావేశాలపై కేంద్ర పార్లమెంటరీ వ్వవహారాల మంత్రి కిరణ్ రిజిజు క్లారిటీ ఇచ్చారు. జూన్ 24న కొత్త లోక్ సభ కొలువుదీరనున్నట్లు కేంద్ర మంత్రి రిజిజు బుధవారం తెలిపారు.

 

తొలి మూడు రోజులు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, లోక్ సభలో వారి సభ్యత్వాన్ని ధృవీకరించడం వంటి కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇక ఇదే సమావేశాల్లో లోక్ సభ స్పీకర్‌ను కూడా ఎన్నుకోనున్నట్లు రిజిజు స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి పార్లమెంట్ సమావేశాల గురించి సమాచారం అందించారు.

 

ఇక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి జూన్ 27న ప్రసంగిస్తారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఇక 264వ రాజ్యసభ సమావేశాలు కూడా జూన్ 27న ప్రారంభమవుతాయని తెలిపారు. లోక్ సభ ఎన్నికల తర్వాత జరగనున్న తొలి పార్లమెంట్ సమావేశాలు జులై 3న ముగియనున్నట్లు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 

జూన్ 27న రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ తన మంత్రి మండలిని పార్లమెంట్‌కు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టనుండగా ప్రధాని మోదీ సమాధానమిస్తారని భావిస్తున్నారు.

 

చివరగా పార్లమెంట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 10 వరకు జరిగాయి. ఈ సెషన్‌లో ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత, కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను సమర్పించనుంది. జూలైలో ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందని భావిస్తున్నారు.

 

ఈ పూర్తి బడ్జెట్ కొత్త ప్రభుత్వ ఆర్థిక విధానాలు, ఖర్చులు, మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ ప్రణాళికలను వివరిస్తుంది. ఇది కొత్త పరిపాలన ప్రాధాన్యతలను, పాలసీ మేకింగ్, విధానపరమైన మార్పులను ప్రతిబింబిస్తుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |