UPDATES  

NEWS

 ఏపీ పోలీసులకు కేంద్రం మరో ఝలక్..

ఏపీలో పోలీసు అధికారులకు ఎన్నికల వేళ వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల నిష్పాక్షిక నిర్వహణలో వైఫల్యంపై ఇప్పటికే 10 మందికి పైగా ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు పడింది. మరికొందరు కింది స్థాయి అధికారులపైనా విచారణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో అంశంలో పోలీసుల వైఫల్యంపై విచారణకు కేంద్రం ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీసులు మరోసారి ఇరుకునపడ్డారు.

 

ఏపీలో ఎన్డీయే కూటమి పార్టీల ప్రచారంలో భాగంగా మే 8న ప్రధాని మోడీ విజయవాడకు వచ్చారు. నగరంలోని బందరు రోడ్డులో పీవీపీ మాల్ నుంచి బెంజ్ సర్కిల్ వరకూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి మోడీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో సందర్భంగా ప్రధాని భద్రతను చూస్తున్న ఎస్పీజీ అధికారులు ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. ఇక్కడ ఎలాంటి వస్తువులు, డ్రోన్లు ఎగరవేయకుండా నిషేధం విధించారు.

 

కానీ ఈ ఆంక్షల్ని ఉల్లంఘించి ప్రధాని భద్రతకు ముప్పు వాటిల్లేలా బందరు రోడ్డులో కొందరు డ్రోన్లు ఎగరవేశారు. ర్యాలీ ప్రారంభం, చివర్లో ఇలా డ్రోన్లు ఎగరవేసినట్లు గుర్తించారు. దీనిపై అప్పటికప్పుడు స్పందించిన ఎస్పీజీ సిబ్బంది ఓ డ్రోన్ ను కూల్చేసినట్లు తెలిసింది. పోలీసులకు ముందుగా సమాచారం ఇచ్చినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా డ్రోన్లు ఎగరవేయడంపై ఎస్పీజీ నుంచి అందిన ఫిర్యాదుపై కేంద్రం స్పందించింది.

 

ప్రధాని రోడ్ షోలో భద్రతా ఉల్లంఘనగా దీన్ని పరిగణించి ఈ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తాకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. దీంతో డీజీపీ తక్షణ విచారణ చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. ఇందులో బాధ్యులుగా తేలిన వారిపై చర్యలు తప్పేలా లేవు. అనంతరం ఈ చర్యల వివరాలను కేంద్రానికి పంపాల్సి ఉంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |