UPDATES  

NEWS

 కవిత బెయిల్‌పై తేల్చేయనున్న హైకోర్ట్..

దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. బెయిల్ పిటీషన్ భవితవ్యం నేడు తేలిపోనుంది. బెయిల్ కోసం ఆమె దాఖలు చేసుకున్న పిటీషన్లపై ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ కొనసాగించనుంది.

 

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు కవిత. 100 కోట్ల రూపాయల మొత్తాన్ని ఆమ్ ఆద్మీ పార్ట నాయకులకు చెల్లించినట్లు ఆమెపై ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. మార్చి 15వ తేదీన ఈడీ, ఏప్రిల్ 11వ తేదీన సీబీఐ అధికారులు కవితను అరెస్ట్ చేశారు.

 

ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. తీహార్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్నారు. బెయిల్ కోసం కవిత దాఖలు చేసుకున్న పిటీషన్లపై ఈ నెల 6వ తేదీన రోస్ అవెన్యూ న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఆమెకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ మేరకు రోస్ అవెన్యూ న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా తీర్పు ఇచ్చారు.

 

ఈ క్రమంలో బెయిల్ కోసం కవిత.. ఇదివరకే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్లను వేశారు. కవిత తరఫున ప్రముఖ న్యాయవాదులు మోహిత్ రావు, దీపక్ నగర్ ఈ పిటీషన్లను దాఖలు చేశారు. వాటిని విచారణకు స్వీకరించింది ఢిల్లీ హైకోర్టు. న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ బెంచ్.. విచారణ చేపట్టింది.

 

ఈ కేసులో మనీలాండరింగ్ కేసులో సెక్షన్ 50 కింద అప్రూవర్‌ మారిన వ్యక్తి ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా మాత్రమే ఈడీ దర్యాప్తు కొనసాగుతోందని, ఆ స్టేట్‌మెంట్లకు సంబంధించిన ఒక్క డాక్యుమెంట్‌ను కూడా ఇప్పటివరకు అధికారులు సేకరించలేకపోయారని కవిత తన పిటీషన్‌లో పేర్కొన్నారు.

 

పీఎంఎల్ఏలోని సెక్షన్ 19 ప్రకారం తనను అరెస్టు చేయడం అక్రమం అని, 100 కోట్ల రూపాయలను ఆప్ నేతలకు చెల్లించినట్లు ఎలాంటి సాక్ష్యాధారాలను కూడా సంపాదించలేకపోయారని, ఆ నగదును కూడా రికవర్ చేయలేకపోయారని అన్నారు. తనను అరెస్ట్ చేయడానికి ఇదొక కారణంగా చూపించారని వ్యాఖ్యానించారు.

 

విచారణ సందర్భంగా కవిత దాఖలు చేసిన పిటిషన్లపై తమ అభిప్రాయాలను తెలియజేయాలంటూ ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది జస్టిస్ స్వర్ణ కాంత శర్మ బెంచ్. తదుపరి విచారణ ను నేటికి అంటే మే 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో నేడు మరోసారి ఈ పిటీషన్లపై విచారణ జరుగనుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |