కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ఆరంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. గడువు దాటిన తరువాత కూడా క్యూలైన్‌లో వేచివున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు ఎన్నికల సిబ్బంది.
దశాబ్ద కాలం తరువాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలను ఎదుర్కొంటోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే. మొత్తం మూడు దశల్లో పోలింగ్ నిర్వహించేలా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేసింది.
ఇక్కడ ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య.. 90. నేడు పాంపోర్, త్రాల్, పుల్వామా, రాజ్‌పొరా, జైనపొరా, షోపియాన్, డీహెచ్‌పొరా, కుల్గామ్, దేవ్సార్, దూరు, కోకెర్‌నాగ్, అనంతనాగ్ వెస్ట్, అనంతనాగ్, శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరా, షాంగస్-అనంతనాగ్ ఈస్ట్, పహల్‌గామ్, ఇందర్వాల్, కిష్తవార్, పద్దెర్-నాగ్‌సెని, భడర్వా, దోడా, దోడా వెస్ట్, రాంబన్, బనిహాల్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.
తొలిదశలో 23,27,580 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 11,76,462 మంది పురుషులు, 11,51,058 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. మొత్తం 3,276 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 14,000 మంది పోలింగ్ సిబ్బంది విధి నిర్వహణలో ఉన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మిర్, సీపీఎం నేత మహ్మద్ యూసుఫ్ తరిగామి, నేషనల్ కాన్ఫరెన్స్ రాష్ట్ర కార్యదర్వి సకినా ఇటూ, పీడీపీకి చెందిన సర్తాజ్ మద్నీ అబ్దుల్ రెహ్మాన్ వీరి.. వంటి కీలక అభ్యర్థులు ఈ తొలి విడత ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు.
బీజేపీ సీనియర్ నేత సునీల్ శర్మ, మాజీ ఎమ్మెల్యే దిలీప్ సింగ్ పరిహార్ తొలి విడత ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తంగా 219 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అక్టోబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపును షెడ్యూల్ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. జమ్మూ కాశ్మీర్‌తో పాటు హర్యానాకు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఆ రోజే ఉంటుంది.
కాగా జమ్మూ కాశ్మీర్ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా అంచనాలకు మించి సత్తా చాటింది. అయిదు లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ, ఇండియా భాగస్వామ్య పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ రెండు చొప్పున సీట్లల్లో విజయం సాధించాయి. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.
ఉదయం 9 గంటల వరకు 11.11 శాతం మేర పోలింగ్ ఇక్కడ నమోదైంది. అత్యధికంగా కిష్తవార్‌లో 14.83 శాతం పోలింగ్ జరిగింది. 9.18 శాతం అత్యల్ప ఓటింగ్ పుల్వామాలో రికార్డయింది. అనంత్‌నాగ్- 10.26, దోడా- 12.90, కుల్గామ్- 10.77, రాంబన్- 11.91, షోపియాన్- 11.44 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.