వరద బాధితులకు ప్రభుత్వం ఆర్దిక ప్యాకేజీ ప్రకటించింది. భారీగా నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ ఆర్దిక సాయం ఇవ్వాలని నిర్ణయించింది. వరదల్లో మునిగిన ప్రతీ ఇంటికి రూ 25 వేలు అందనుంది. అదే విధంగా ప్రతీ వాహనదారుడితో పాటుగా వ్యాపారులకు ఆర్దికంగా ప్రభుత్వం సాయం ఖరారు చేసింది. ప్యాకేజీలో భాగంగా బాధితులకు అందే పరిహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
బాధితులకు అండగా
విజయవాడ వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం ఆర్దికంగా ప్యాకేజీ ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. బుధవారం నుంచే నష్ట పరిహారం పంపిణీ ప్రారంభమవుతుందని, వీలైనంతవరకూ రెండు మూడు రోజుల్లోనే బాధితుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని తెలిపారు. దీని ప్రకారం…వరదల్లో మునిగిన ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నవారికి ప్రతి కుటుంబానికి రూ.పాతికవేలు ఇస్తారు. ఆ పై అంతస్థుల్లో ఉన్నవారికి వారు పడిన ఇబ్బందులకు… పని పోయినందుకు పరిహారంగా ప్రతి కుటుంబానికి రూ. పది వేలు అందిస్తారు.
ఆర్దిక ప్యాకేజీ
పరిహారం ఇళ్లలో ఎవరు ఉంటే వారికే ఇస్తామని, అద్దెకు ఉండేవారు ఉంటే వారికే వ స్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. విజయవాడ నగరం, దానిని ఆనుకొని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 172 వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలో ఈ ప్యాకేజీ వర్తిస్తుంది. షాపులు, ఇతర వాణిజ్య సంస్ధలకు వాటిల్లిన నష్టం ఎక్కువగా ఉండటంతో వాటికి వేరే ప్యాకేజీ ప్రకటించారు. చిన్న కిరాణా షాపులు, టీ కొట్లకు రూ.పాతిక వేలు, వ్యాపారం కింద నమోదై రూ.నలభై లక్షల లోపు టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్ధలకు రూ.ఏభై వేలు, రూ.నలభై లక్షల నుంచి రూ.కోటిన్నర వరకూ టర్నోవర్ ఉన్న షాపులకు రూ.లక్ష వరకు ఇవ్వనున్నారు.
ప్రతీ ఇంటికి సాయం
ఇంత కంటే ఎక్కవ టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్ధలకు రూ. లక్షన్నర పరిహారంగా ఇస్తారు. ద్విచక్ర వాహనాల రిపేర్లకు రూ. మూడు వేలు ఇస్తారు. ఆటోలకు రూ. పది వేలు ఇస్తారు. తోపుడు బళ్ళు పోయినా… దెబ్బతిన్నా ప్రభుత్వం వాటిని ఉచితంగా సమకూరుస్తుంది. చేనేత పనివారి మగ్గం పూర్తిగా పోతే రూ.పాతిక వేలు ఇస్తారు. గేదెలు, ఆవులు చనిపోతే రూ.ఏభై వేలు ఇస్తారు. ఎద్దులు చనిపోతే ఒక్కోదానికి రూ. నలభై వేలు అందిస్తారు. పశువుల కొట్టం పోతే రూ. ఏడున్నర వేలు ఇస్తారు. ఇల్లు పూర్తిగా పోతే కొత్త ఇల్లు ఇస్తారు. పంట నష్టం కింద కొన్ని పంటలకు ఎకరానికి రూ. పది వేలు, కొన్ని వాణిజ్య పంటలకు రూ. 14 వేలు చంద్రబాబు ప్రకటించారు.