భారత ఎన్నికల సంఘం బీజేపీ, కాంగ్రెస్ ను హెచ్చరించింది. తమ స్టార్ క్యాంపెయినర్లు మర్యాదపూర్వకంగా ఉండేలా చూసుకోవాలని ఇరు పార్టీలకు సూచించింది. మతతత్వ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కోరింది. భారత రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్‌లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీంతో ఎన్నికల సంఘం వారికి నోటీసులు ఇచ్చింది. నోటీసులకు వారు సమాధానం కూడా చెప్పారు.
దీనిపై తాజాగా ఈసీ తాజా ప్రకటన జారీ చేసింది. తమ స్టార్ క్యాంపెయినర్ల ప్రసంగాలపై బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులకు నోటీసులు జారీ చేసిన దాదాపు నెల రోజుల తర్వాత బుధవారం ఈసీ ఈ ప్రకటన చేసింది. ఈసీ నోటీసుకు ఇచ్చిన సమాధానాల్లో ఇరు పార్టీలు తమ నేతల ప్రకటనలను సమర్థించుకున్నాయి. మోడీ లేదా గాంధీ పేరును ప్రస్తావించకుండా.. పోల్ ప్యానెల్ బుధవారం వరుసగా బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు జేపీ నడ్డా, మల్లికార్జున్ ఖర్గేలకు లేఖలు రాసింది.
తమ స్టార్ క్యాంపెయినర్లు “సమాజాన్ని విభజించే” ప్రసంగాలు, ప్రకటనలు చేయకుండా చూసుకోవాలని బిజెపిని కోరినప్పటికీ.. దాన్ని స్టార్ క్యాంపెయినర్లు పట్టించుకోవడం లేదని పేర్కొంది. భారత రాజ్యాంగం గురించి తప్పుడు ప్రకటనలు చేయకుండా చూసుకోవాలని కాంగ్రెస్‌ను కోరింది. ఇరు పార్టీల నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఈసీ తెలిపింది. వివాదాస్పద వ్యాఖ్యలపై పోల్ ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది.
రెండు పార్టీల నాయకులు చేసిన అనేక వ్యాఖ్యలను సంబంధిత లేఖలో ప్రస్తావించింది. కాగా ఆరో దశ లోక్ సభ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 25న ఆరో దశ లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 1న ఏడో దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 4న ఫలితాలు ప్రకటించనున్నారు. జూన్ 1 సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశం ఉంది.









