ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఘర్షణలు చోటు చేసుకున్న ప్రాంతాలలో సిట్ దర్యాప్తు బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి అన్ని కోణాలలో విచారణ చేసి దీనికి బాధ్యులను గుర్తించింది. ఎన్నికల సంఘం ఆదేశం మేరకు సిట్ ఈరోజు ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించింది.
మూడు జిల్లాలలో 33 హింసాత్మక ఘటనలు ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ డిజిపి కి అందజేశారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలలో రెండు రోజులపాటు పర్యటించిన సిట్ బృందం నిన్న అర్ధరాత్రి వరకు దర్యాప్తు కొనసాగించారు, మొత్తం ఈ మూడు జిల్లాలలో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించి నివేదికను డీజీపీకి అందించారు.
దాడులు జరిగిన చోట క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇచ్చిన సిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఈ దాడులు, అల్లర్లపై రెండు రోజులపాటు విచారణ జరిపిన సిట్ అల్లర్లు జరిగిన ప్రాంతానికి నేరుగా వెళ్లి, అక్కడ పరిశీలించి, విచారణ జరిపారు. అంతేకాదు అక్కడ నమోదైన కేసుల పైన పోలీస్ అధికారుల నుండి వివరణ తెలుసుకుని కొన్ని సెక్షన్ల మార్పుకు సిఫార్సు కూడా చేశారు. కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేసే అంశం పైన కూడా కొంత సమాచారం ఇచ్చినట్టు నివేదికలో పేర్కొన్నారు.
దాడులు జరుగుతాయని తెలిసీ ఆలస్యంగా వెళ్ళిన పోలీసులు అయితే ఈ దర్యాప్తులో కొందరు అధికారులు హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసి కూడా ఆలస్యంగా వెళ్ళినట్టు పేర్కొన్నారు. స్థానిక రాజకీయ నేతలతో పోలీసులు కుమ్మకైనట్టు సిట్ తన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. సిట్ దాని దర్యాప్తు సందర్భంగా దాడుల విషయంలో పలువురు నేతలను, స్థానికులను, పోలీసులను విచారించారు. అంతేకాదు ఈ ఘటనల పైన నమోదైన ఎఫ్ఐఆర్ లను సైతం పరిశీలించి అసలేం జరిగిందనేది నివేదికలో పొందుపరిచారు.
డీజీపీకి ప్రాధమిక నివేదిక ఇచ్చిన సిట్ అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు డిజిపి ఏర్పాటు చేసిన సిట్ బృందం ఈ దాడులకు సంబంధించి అత్యంత కీలకమైన సమాచారాన్ని ప్రాథమిక నివేదికలో పొందుపరిచి డీజీపీకి అందించారు. ఇందులో కొందరు కీలక రాజకీయ నాయకుల పేర్లు కూడా ఉన్నట్టు సమాచారం. దీంతో ఈ నివేదికను ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి డీజీపీ అందించనున్నారు. మరి ఈ నివేదిక నేపధ్యంలో ముందు ముందు ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.









