ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారింది. గెలుపు కోసం ప్రధాన పార్టీలు అస్త్రాలు ప్రయోగిస్తున్నాయి,. జగన్ లక్ష్యంగా మూడ పార్టీల కూటమి మేనిఫెస్టో ప్రకటించింది. జగన్ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా మారిన ఎన్నికల యుద్దం సాగుతున్న వేళ జగన్ కేసుల విషయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జగన్ అక్రమాస్తుల కేసు సీబీఐ కోర్టులో మళ్లీ మెదటికి వచ్చినట్లయింది.
మళ్లీ మొదటికి ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. జగన్ కేసులపై సీబీఐ కోర్టులో గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది. ఆయా చార్జిషీట్ల నుంచి తమను తప్పించాలని కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి సహా ఇతర నిందితులు దాఖలు చేసిన 130 డిశ్చార్జి పిటిషన్‌లపై తీర్పు వెలువడాల్సి ఉంది. వీటి పరిష్కారానికి హైకోర్టు ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించింది. ఈ గడువు సైతం ఏప్రిల్ 30తో ముగిసింది. మంగళవారం ఈ పిటిషన్‌లలో తీర్పు వెలువడుతుందని అంతా భావించారు. అయితే, అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదని సీబీఐ కోర్టు జడ్జి రమేశ్‌బాబు పేర్కొన్నారు. ఇటీవల బదిలీల్లో రమేశ్‌బాబు సైతం వేరే కోర్టుకు బదిలీ అయ్యారు. ఈ కారణంగా మళ్లీ మొదటి నుంచి కేసులు వినేందుకు మే 15కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
12 ఏళ్లుగా విచారణ తాజా పరిణామంతో 12 ఏళ్లుగా కొనసాగుతున్న విచారణ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. 2013 నుంచి సీబీఐ కోర్టులో ఏడుగురు జడ్జిలు బదిలీ అయ్యారు. 2022, మే 4 నుంచి ఆయన జగన్ అక్రమాస్తులకు సంబంధించిన డిశ్చార్జి పిటిషన్‌లపై రమేష్ బాబు సుదీర్ఘంగా వాదనలు విన్నారు. తీర్పు వెలువరించాల్సిన సమయంలో బదిలీ కావడంతో ఆయన కేసులను తిరిగి ప్రారంభిస్తున్నట్టు(రీ ఓపెన్) ప్రకటించారు. దీంతో కొత్తగా వచ్చే జడ్జి మళ్లీ ఈ కేసులను మొదటి నుంచి వినాల్సిన అవసరం ఏర్పడింది. ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ వేగంగా పూర్తి చేసి.. తీర్పులు ఇవ్వాలని అశ్వినీ ఉపాధ్యాయ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కేసులను హైకోర్టులు ప్రత్యక్షంగా పరిశీలించాలని.. దిగువ కోర్టులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంది.
వాట్ నెక్ట్స్ ఇక, సీబీఐ కోర్టు జడ్జి రమేశ్‌బాబు.. ఎమ్మార్ కేసులో నిందితులు దాఖలు చేసిన 9 డిశ్చార్జి పిటిషన్‌లపై తీర్పు వెలువరించారు. జగన్ సన్నిహితుడు ఎన్. సునీల్‌రెడ్డి , కోనేరు ప్రదీప్, విజయరాఘవ, శ్రీకాంత్ జోషి, ఎమ్మార్ ఎంజీఎఫ్, ఎమ్మార్ ప్రాపర్టీస్, ఎమ్మార్ హిల్స్, బౌల్డర్ హిల్స్ డిశ్చార్జి పిటిషన్‌లను కోర్టు కొట్టేసింది. మరో నిందితుడు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బీపీ ఆచార్యపై 120బీ, 409 సెక్షన్లను తొలగించిన సీబీఐ కోర్టు.. అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు ఎదుర్కోవాల్సిందేనని పేర్కొంది. ఇతర నిందితులను కేసు నుంచి తప్పించడానికి నిరాకరించింది. నిందితులు విచారణను ఎదుర్కోవాల్సిందేనని ప్రకటించింది.









