ఏపీలో విపక్ష ఎన్డీయే కూటమి ఇవాళ ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేసింది. అయితే ఈ మ్యానిపెస్టో విడుదల కార్యక్రమంలో బీజేపీ మొక్కుబడిగా పాల్గొంది. బీజేపీ జాతీయ నేత సిద్ధార్ధ్ నాథ్ సింగ్ ఈ కార్యక్రమంలో మొహమాటంగా పాల్గొని మమ అనిపించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అయితే పూర్తిగా దూరంగా ఉండిపోయారు. అయితే కూటమి మ్యానిఫెస్టోలో మోడీ ఫొటో కనిపించడం వెనుక బీజేపీ హైకమాండ్ ఫోన్ కాల్ కారణమని సీఎం జగన్ చెప్పేశారు.
అయితే అంతకు మించిన కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ కూటమి ప్రకటించిన మ్యానిఫెస్టోలో ముస్లింలకు రెండు కీలక హామీలు ఇచ్చింది. వాటిలో ఒకటి ముస్లింలకు హజ్ యాత్రకు లక్ష రూపాయల సాయం, రెండవది 50 ఏళ్లకే పెన్షన్. ఈ రెండు హామీలతో పాటు మౌజన్, ఇమామ్ లకు నెలవారీ సాయం, హజ్ హౌస్ వంటివి ఎలాగో ఉన్నాయి. అలాగే ఈ మధ్య పదే పదే చెప్తున్న రిజర్వేషన్ల పరిరక్షణ హామీ కూడా ఉంది. వీటిపై జాతీయ స్ధాయిలో గళమెత్తుతున్న బీజేపీకి మ్యానిఫెస్టోలో అవి ఉండటం ఇష్టం లేదు.
దీంతో చివరి నిమిషంలో మ్యానిఫెస్టోలో తమ నేతల ఫొటోలు లేకుండా బీజేపీ అధిష్టానం ఫోన్ చేసి తీయించినట్లు తెలుస్తోంది. అలాగే మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధార్ధ్ నాధ్ సింగ్ సైతం మ్యానిఫెస్టో కాపీని చేత్తో పట్టుకుని ప్రదర్శించేందుకు సైతం ఇష్టపడలేదు. అయితే ఈ కార్యక్రమం కవరేజ్ కు వెళ్లిన మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే మాత్రం సిద్ధార్ధ్ నాథ్ సింగ్ ఈ మ్యానిఫెస్టోకు తమ మద్దతు ఉందని చెప్పి సరిపెట్టారు.









