ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. అధినేతల ప్రచారం కొనసాగుతోంది. మరో వైపు కూటమి పార్టీల నుంచి వైసీపీలో చేరికలు పెరిగాయి. జగన్ బస్సు యాత్ర సమయంలోనే టీడీపీ, జనసేన నేతలను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ విశాఖ నగరంలో బస్సు యాత్రలో పాల్గొన్నారు. నగరంలోని పలు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ, జనసేన నేతల వైసీపీలో చేరారు. జగన్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
విశాఖలో ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. విశాఖలోని టీడీపీ, జనసేనకు చెందిన పలువురు వైసీపీలో చేరారు. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం చిన్నయ్యపాలెం జగన్ బస చేసిన ప్రాంతంలో టీడీపీ, జనసేన నేతలు కలిసారు. అధికార పార్టీలో చేరిన వారిలో జనసేన సీనియర్ నేత గంపల గిరిధర్, ఎన్ శ్రీనివాస్, జీ శ్రీజ , ధనుష్, విద్యావేత్త అలీవర్ రాజ్ రాయ్ ఉన్నారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2019 లో జనసేన తరపున విశాఖ సౌత్ నుంచి గంపల గిరిధర్ పోటీ చేసారు. ప్రస్తుతం పార్టీలో పరిణామాల కారణంగా ఆయన పార్టీ వీడి వైసీపీలో చేరారు.
భీమిలి నియోజకవర్గానికి చెందిన జనసేన నేత, ఫెడరేషన్ ఆఫ్ ఏపీ అండ్ టీఎస్ఎఫ్సీఆర్ఏ ఎన్జీవోస్ ఛైర్మన్, విద్యావేత్త అలీవర్ రాజ్ రాయ్ సైతం జగన్ తో సమావేశమయ్యారు. ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పని చేసేందుకు సంసిద్దత వ్యక్తం చేసారు. శంకర్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ క్రిష్ణకుమార్, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు రామ, వుడా మాజీ డైరెక్టర్ భారతీ, టీడీపీ యువజన విభాగం నేతలు చరణ్,సందీప్ లు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేయాలని వారికి ముఖ్యమంత్రి సూచించారు. పార్టీ కోసం పని చేసిన వారికి అధికారంలోకి వచ్చిన తరువాత సముచిత ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు.









