అమరావతిలో సాంకేతిక విప్లవానికి కీలక అడుగు పడింది. దేశంలోనే తొలి ఓపెన్ క్వాంటం కంప్యూటర్ ఏప్రిల్ 14వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. విద్యార్థులు, పరిశోధకులు ఈ అత్యాధునిక సాంకేతికతను టెస్టింగ్ కోసం వినియోగించుకోవచ్చని క్యూబిట్ ఫోర్స్ సంస్థ డైరెక్టర్ వెంకట్ సుబ్రమణ్యన్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సతీష్ కుమార్ తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ కీలక ప్రకటన వెలువడింది. అమరావతి క్వాంటం వ్యాలీలో క్వాంటం హార్డ్‌వేర్ తయారీ ఎకోసిస్టమ్ ఏర్పాటుపై ఈ భేటీ జరిగింది.
ఈ సమావేశంలో నేషనల్ క్వాంటం మిషన్ (ఎన్‌క్యూఎం) డైరెక్టర్ జేబీవీ రెడ్డి, స్టేట్ క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్, ఐబీఎం డైరెక్టర్ అమిత్ సింఘీ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన సీడాక్, సీడాట్, డీఆర్డీఓ, బార్క్, నేవల్ సైన్స్ టెక్నాలాజికల్ లేబొరేటరీ ప్రతినిధులు హాజరయ్యారు. జాతీయ క్వాంటం మిషన్ లక్ష్యాలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని ఎన్‌క్యూఎం డైరెక్టర్ జేబీవీ రెడ్డి ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు.
రాష్ట్రంలో క్వాంటం ఎకోసిస్టమ్‌కు అనువుగా టెస్ట్ బెడ్స్, సర్టిఫికేషన్ కేంద్రాలు ఉండాలని సీడాక్ ఈడీ సుదర్శన్ సూచించారు. క్వాంటం సిమ్యులేటర్స్‌తో పాటు బయో సెన్సార్స్, మినరల్ సెన్సార్స్, లేజర్ అప్లికేషన్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వివిధ క్వాంటం కంప్యూటింగ్ సంస్థలు ముఖ్యమంత్రికి తెలియజేశాయి. ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ కామకోటి వర్చువల్‌గా పాల్గొనగా, ఐఐటీ తిరుపతి ప్రొఫెసర్ సత్యనారాయణ కూడా హాజరయ్యారు.
ఈ సమావేశానికి మొత్తంగా 30కి పైగా క్వాంటం కంప్యూటింగ్, క్రయోజనిక్స్, ఫోటోనిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతినిధులు హాజరుకావడం విశేషం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 15 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటిలో 7 సంస్థలు విజయవాడలోని మేధా టవర్స్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఈ పరిణామాలతో అమరావతి దేశ క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.








