కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ రాజ్యసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలను ఎండగట్టిన కేంద్ర మంత్రి, గత ప్రభుత్వ ప్లానింగ్, డిజైన్ లోపాలనే ప్రధాన కారణాలుగా వేలెత్తి చూపారు. సుమారు లక్ష కోట్ల ప్రజాధనం వృధాగా నీళ్లలో పోశారని ఆయన విమర్శలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి సభలో కోరగా, దానికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించలేదు. దానికి బదులుగా, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఇచ్చిన నివేదికను ఆయన ఉటంకించారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన సాంకేతిక లోపాలను, డిజైన్ పరంగా జరిగిన తప్పిదాలను కేంద్ర బృందం లోతుగా అధ్యయనం చేస్తోందని పాటిల్ వెల్లడించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ జోక్యం చేసుకుంటూ, కాళేశ్వరంలో జరిగిన భారీ అవినీతిపై సీబీఐ (CBI) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కేవలం కాళేశ్వరం మాత్రమే కాకుండా, జల్ జీవన్ మిషన్ నిధుల వినియోగంలో కూడా తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని కేంద్రం ధ్వజమెత్తెంది. రాష్ట్రం వద్ద సుమారు రూ. 873 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నా, గత మూడేళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ. 194 కోట్లు మాత్రమేనని మంత్రి వివరించారు. కేంద్రం నుండి నిధులు ఉన్నప్పటికీ, కొత్త స్కీమ్‌లకు సంబంధించి ఒక్క ప్రతిపాదన కూడా తెలంగాణ నుండి గత మూడేళ్లుగా రాలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం ఇస్తున్న సహకారాన్ని రాష్ట్రం సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు అటు పార్లమెంట్ లోనూ, ఇటు రాష్ట్రంలోనూ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంపై బీఆర్ఎస్ చేసిన ఖర్చు, డిజైన్ల నాణ్యతపై కేంద్రం బహిరంగంగానే పెదవి విరవడం ఆ పార్టీని డిఫెన్స్‌లో పడేసింది. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.








