హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న చారిత్రాత్మక ఎల్‌బీ స్టేడియం సుదీర్ఘ విరామం తర్వాత క్రీడాస్ఫూర్తికి వేదికగా మారింది. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు అందరూ ఒకచోట చేరి క్రీడల్లో పాల్గొనడంతో స్టేడియం ప్రాంగణం కోలాహలంగా కనిపించింది. నాయకులు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందనే ‘ఫిట్ లీడర్స్ – ఫిట్ స్టేట్’ సందేశంతో తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ కల్చరల్ మీట్ – మొదటి ఎడిషన్ అత్యంత ఉత్సాహభరితంగా ప్రారంభమైంది.
దాదాపు 14 ఏళ్లుగా నిలిచిపోయిన ఈ క్రీడా సంప్రదాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ప్రారంభించారు. కేవలం ప్రారంభించడమే కాకుండా ఆయన స్వయంగా సహచర మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి పలు క్రీడల్లో పాల్గొని అందరిలో నూతన ఉత్తేజం నింపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎల్‌బీ స్టేడియానికి ఉన్న గొప్ప చరిత్రను గుర్తుచేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్రీడాకారులు ఇక్కడ శిక్షణ పొందారని ఈ మైదానాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గచ్చిబౌలిలోని క్రీడా మైదానాలను సుమారు 700 కోట్ల రూపాయలతో ప్రపంచ స్థాయి వసతులతో తీర్చిదిద్దుతామని ప్రకటించారు. 2034 ఒలింపిక్స్ నిర్వహణే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశామని మరో మూడు నెలల్లో అక్కడ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రధాన క్రీడలన్నీ గచ్చిబౌలి వేదికగానే నిర్వహించేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బేగంపేట హాకీ మైదానాన్ని సైతం ఆధునీకరించి క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామన్నారు.
గతంలో హైదరాబాద్ క్రీడలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 1950-60 దశకంలో భారత ఫుట్‌బాల్ జట్టు ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచినప్పుడు అందులో ఏడుగురు క్రీడాకారులు హైదరాబాద్ నగరం నుంచే ప్రాతినిధ్యం వహించారని గుర్తుచేశారు. ఒకప్పుడు హాకీ ఫుట్‌బాల్ క్రికెట్ వంటి క్రీడల్లో మన రాష్ట్రానికి మంచి పేరు ఉండేదని అయితే ప్రస్తుతం క్రీడల్లో వెనకబడటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో క్రీడాస్ఫూర్తిని నింపడానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రీడలు ప్రాధాన్యత కోల్పోయాయని ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రత్యేక క్రీడా పాలసీని తీసుకువచ్చామని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలను నిర్వహించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒలింపిక్స్‌లో క్వాలిఫై కావడానికి కూడా ఇబ్బంది పడుతుంటే దక్షిణ కొరియా వంటి చిన్న దేశం స్పోర్ట్స్ యూనివర్సిటీల ద్వారా పతకాలు సాధిస్తోందని ఉదాహరించారు. క్రీడల పట్ల పట్టుదల పెంచుకోవాలని సూచిస్తూ ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్‌కు ఆహ్వానించినట్లు వెల్లడించారు. క్రీడల్లో రాణించే విద్యార్థులను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రసంగం అనంతరం నిర్వహించిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని గోల్ కొట్టడంతో మైదానం హర్షధ్వానాలతో మారుమోగింది.








