హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానందగౌడ్ శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగనాథ్ ప్రజల కోసం పనిచేస్తున్నారా లేక రాజకీయం చేస్తున్నారా అని ప్రశ్నించారు. రంగనాథ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను వివేకానందగౌడ్ శాసనసభలో ప్రస్తావించారు.
ఒక ఇంటర్వ్యూలో హైడ్రా పనితీరు గురించి మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు హైడ్రాకు రెఫరెండంగా పేర్కొన్నారు. దీనితో రంగనాథ్ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తాయి.
ఈరోజు వివేకానంద గౌడ్ అసెంబ్లీలో మాట్లాడుతూ, రంగనాథ్ మాట్లాడిన ఇంటర్వ్యూను చూసి షాకయ్యానని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను హైడ్రాకు రెఫరెండంగా ఒక అధికారి చెప్పడమేమిటని ప్రశ్నించారు. ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నారా లేక రాజకీయం చేస్తున్నారా అని నిలదీశారు. ఆయనకు రాజకీయం చేయాలనే ఆసక్తి అంతగా ఉంటే ఖద్దర్ దుస్తులు వేసుకుంటే సరిపోతుంది కదా అని ఎద్దేవా చేశారు. తమలాంటి రాజకీయ నాయకులు ఈరోజు ఉండి రేపు వెళ్లిపోతారని, కానీ అధికారులు సంవత్సరాల కొద్ది పనిచేస్తారని వివేకానందగౌడ్ తెలిపారు.








