UPDATES  

NEWS

 ఈ రెండు రంగాలకు అత్యంత ప్రాధాన్యం: సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణలో విద్య, వైద్య రంగాలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రెండు రంగాలకు కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా కోత విధించే ప్రసక్తే లేదని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు. గురువారం శాసనసభలో పద్దులపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు.

 

ఆరోగ్యశ్రీ పథకం కింద బకాయిలు పేరుకుపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు మూతపడుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సీఎం కొట్టిపారేశారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి గత ప్రభుత్వం రూ. 627 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను మిగిల్చిందని, ఆ భారాన్ని మోస్తూనే పథకం పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచామని గుర్తుచేశారు.

 

2023 డిసెంబర్ 8 నుంచి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ ఆసుపత్రులకు రూ. 927 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 1,480 కోట్లు కలిపి మొత్తం రూ. 2,408 కోట్లు చెల్లించామని వివరించారు. ప్రస్తుతం చెల్లించాల్సిన రూ. 727 కోట్ల బకాయిల్లో అత్యధికం గత ప్రభుత్వానివేనని తెలిపారు.

 

రాష్ట్రంలోని 35 మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రులకు రోగులు వెళ్లడం లేదని, అక్కడ వైద్యుల కొరత ఉందని సీఎం అంగీకరించారు. ఈ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు ఆరోగ్యశ్రీ రోగులను అక్కడికి రిఫర్ చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్నారు. వాటి పాలనా పర్యవేక్షణకు గ్రూప్-1 స్థాయి అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. అల్వాల్, ఎల్బీనగర్, సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీలుగా మారుస్తామని, రూ. 3,000 కోట్లతో ఉస్మానియాకు కొత్త భవనం నిర్మిస్తామని ప్రకటించారు.

 

సీఎం సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) దరఖాస్తులను ఆన్‌లైన్ చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేశామని, ఇప్పటివరకు రూ. 2,046 కోట్లు విడుదల చేశామని చెప్పారు. కులగణన సమాచారం ఆధారంగా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు ‘ఇందిరమ్మ జీవిత బీమా’ పథకాన్ని అందించి భరోసా కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |