UPDATES  

NEWS

 విజయవాడలో ఉగ్ర కలకలం… ముగ్గురు యువకుల అరెస్ట్.

ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు విజయవాడలో ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్ అధికారులు మంగళవారం ఈ ఆపరేషన్ నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ (23), ఎండీ డానిష్ (27), మీర్జా సోహైల్ బేగ్ (23)‌లను అదుపులోకి తీసుకున్నారు.

 

విజయవాడలోని వించిపేటలో నిందితుల నివాసాల సమీపంలో వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి నివాసాల్లో సోదాలు నిర్వహించి ఎలక్ట్రానిక్ పరికరాలు, పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు ఐసిస్, ఏక్యూఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ‘అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్’ అనే బృందాన్ని ఏర్పాటు చేసి, యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. భారత జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండాను ఉంచాలంటూ వీరు ప్రచారం చేసినట్లు ఆరోపణలున్నాయి.

 

ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిఘా ఉంచిన సీఐ సెల్, పాకిస్థాన్ నుంచి నిందితులకు నిధులు అందుతున్నట్లు పక్కా సమాచారంతో ఈ అరెస్టులు చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 10 మంది యువకులతో వీరు నెట్‌వర్క్ ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

 

అరెస్ట్ చేసిన ముగ్గురిని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా, వారికి ఏప్రిల్ 6 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం వారిని విజయవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ), ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |