UPDATES  

NEWS

 కామాంధుడి బారి నుంచి చిన్నారిని కాపాడిన హైదరాబాద్ పోలీసులు..

హైదరాబాద్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఆమె కజిన్‌ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) అరెస్ట్ చేసింది. బాలికను రక్షించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయెల్ మంగళవారం తెలిపారు. చిన్నారులపై లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన కేసులో 19 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేసినట్లు ఆమె ప్రకటించారు.

 

టీజీసీఎస్‌బీ పరిధిలోని చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్‌కు (సీపీయూ) చెందిన టిప్‌లైన్ ద్వారా అందిన ఆధారాలను విశ్లేషించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ అఘాయిత్యం గురించి బాలిక తల్లిదండ్రులకు తెలిసి ఉండకపోవచ్చని కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడిని గోల్కొండ, ఛోటా బజార్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఫహాద్‌ (19)గా గుర్తించారు. అతను డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

 

టిప్‌లైన్‌లో షేర్ అయిన వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన టీజీసీఎస్‌బీ అధికారులు నిందితుడిని గుర్తించారు. అతడిని ప్రశ్నించగా, తన నేరాన్ని అంగీకరించాడు. బాధితురాలి ఇంటికి తరచూ వెళ్లే ఫహాద్, ఆ చిన్నారిని ఇంటి టెర్రస్‌పైకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడేవాడని విచారణలో తేలింది. నిందితుడు ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ కోసం డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు.

 

ఈ ఘటనపై శిఖా గోయెల్ స్పందిస్తూ, “ఈ ఏడాది మైనర్ బాలికలను రక్షించడం ఇది రెండోసారి. రెండు ఘటనల్లోనూ నిందితులు బాధితులకు అత్యంత సన్నిహితులే కావడం బాధాకరం. ప్రస్తుత కేసులో, నిందితుడు స్వయంగా బాధితురాలి కజిన్ బ్రదర్. ఆ చిన్నారి అమాయకంగా అతడిని ‘భయ్యా’ అని పిలుస్తుంది,” అని ఆవేదన వ్యక్తం చేశారు.

 

నిందితుడిపై ఐటీ చట్టంలోని సెక్షన్ 67-బి, పోక్సో చట్టంలోని సెక్షన్లు 3, 4, 15 కింద కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. రక్షించిన చిన్నారికి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని, ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నామని డైరెక్టర్ తెలిపారు. పిల్లలపై లైంగిక నేరాల్లో చాలా వరకు నిందితులు కుటుంబానికి తెలిసిన వారే ఉంటున్నారని, కాబట్టి పిల్లల సంరక్షణ విషయంలో ఎవరిని నమ్మాలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని ఆమె సూచించారు. అధునాతన సాంకేతికతతో ఇలాంటి నేరాలను అరికట్టేందుకు టీజీసీఎస్‌బీ నిరంతరం పనిచేస్తోందని, చిన్నారులకు హాని చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |