తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం పవిత్రతను గత పాలకులు దెబ్బతీశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, లడ్డు తయారీలో జరిగిన అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టారు. గత ఐదేళ్ల పాలనలో లడ్డు తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు మాత్రమే కాకుండా, బాత్రూమ్ క్లీన్ చేసేందుకు వాడే కెమికల్స్‌ను కూడా ఉపయోగించారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
2019 నుండి 2024 మధ్య కాలంలో లడ్డు నాణ్యతపై వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించామని చంద్రబాబు తెలిపారు. ఎన్డీడీబీ (NDDB) రిపోర్ట్ ద్వారా లడ్డులో కల్తీ జరిగిందనే విషయం శాస్త్రీయంగా నిరూపితమైందని ఆయన గుర్తు చేశారు. సిట్ (SIT) విచారణ జరుగుతుంటే, తప్పును కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలు తననే క్షమాపణ చెప్పమనడం విడ్డూరంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు కేవలం తిరుమలలోనే కాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో కల్తీ నెయ్యితోనే ప్రసాదాలు తయారు చేయించారని విమర్శించారు.
ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదంలో కెమికల్స్ వాడటం అనేది కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని, ఈ అపచారం వెనుక ఉన్న దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు వైసీపీ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ, ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని విమర్శిస్తోంది. మొత్తానికి ‘బాత్రూమ్ కెమికల్’ వ్యాఖ్యలతో తిరుమల లడ్డు వివాదం మరోసారి ఏపీ రాజకీయాల్లో అగ్గి రాజేసింది.









