మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగించిన భాషపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి బహిరంగ సభల్లో ప్రత్యర్థులను కించపరిచేలా, అగౌరవంగా మాట్లాడటం రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎన్ని చదువులు చదివినా, హార్వర్డ్ వంటి అంతర్జాతీయ విద్యాలయాల్లో కోర్సులు చేసినా కనీసం ఎదుటివారిని గౌరవించే సంస్కారం నేర్చుకోలేదని ఆయన ఘాటుగా విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యక్తిగత దూషణలపై కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ వంటి మహోన్నత నాయకుడిపై విషం చిమ్మడం రేవంత్ రెడ్డి తన పరిపాలనా అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికేనని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఒక ప్రసిద్ధ పద్యాన్ని ఉటంకిస్తూ.. “కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టిన.. అది తన పాత గుణమునే చూపుతుంది” అన్నట్లుగా రేవంత్ ప్రవర్తన ఉందని, అధికారం వచ్చినంత మాత్రాన వ్యక్తిత్వం మారదని కేటీఆర్ దుయ్యబట్టారు.
రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం ప్రతిపక్ష నేతలను వ్యక్తిగతంగా దూషించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగుతోందని కేటీఆర్ ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఆదర్శంగా ఉండాలి తప్ప, వీధి రౌడీలా మాట్లాడకూడదని హితవు పలికారు. రేవంత్ రెడ్డి భాష తెలంగాణ సంస్కృతిని కించపరిచేలా ఉందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే దీనికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ మాటల యుద్ధం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచి, ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.









