UPDATES  

NEWS

 విషాదం: పెళ్లి కావడం లేదని హుసేన్‌సాగర్‌లో దూకి మహిళా టెకీ ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలో ఒక గుండెల్ని పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లిపై ఉన్న అమితమైన ప్రేమ, బాధ్యత ఆ యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. మతిస్థిమితం లేని తన తల్లిని పెళ్లి తర్వాత కూడా తనతోనే ఉంచుకుంటానన్న నిబంధనే ఆమె వివాహానికి అడ్డంకిగా మారింది. తల్లి బాధ్యతను పంచుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో, మనస్తాపానికి గురైన తోష్నివాల్ విజయలక్ష్మి (26) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హుసేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా కండ్లకోయకు చెందిన విజయలక్ష్మి కూకట్‌పల్లిలోని మైత్రినగర్‌లో నివాసం ఉంటోంది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఆమె, అనారోగ్యంతో ఉన్న తల్లి సరస్వతికి అన్నీ తానై చూసుకునేది. ఇటీవల ఆమెకు పెళ్లి సంబంధాలు రాగా, “పెళ్లి తర్వాత నా తల్లి కూడా నాతోనే ఉంటుంది, ఆమెను చూసుకునేవారు ఎవరూ లేరు” అని కండిషన్ పెట్టేది. అయితే విజయలక్ష్మి తల్లి బాధ్యతను తీసుకోవడానికి ఏ సంబంధం వారు అంగీకరించకపోవడంతో వరుసగా పెళ్లి సంబంధాలు రద్దు అవుతూ వచ్చాయి. దీనిని తన దురదృష్టంగా భావించిన ఆమె తీవ్ర మనోవేదనకు లోనైంది.

గత శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన విజయలక్ష్మి ఎంతకీ తిరిగి రాకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టగా, సోమవారం ఉదయం హుసేన్‌సాగర్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. తల్లిని అనాథగా వదలలేక, తన భవిష్యత్తు అంధకారమౌతోందన్న భయంతో ఒక ప్రతిభావంతురాలైన టెకీ ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం స్థానికులను కన్నీరు పెట్టించింది. ఈ ఘటన సామాజిక బాధ్యతపై మరియు వృద్ధాప్యంలో తల్లిదండ్రుల సంరక్షణ పట్ల సమాజం ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |