తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, మాజీ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై స్పష్టతనిచ్చారు. కేటీఆర్‌ను పోలీసులు నేరస్తుడిగా పరిగణించలేదని, కేవలం సాక్షిగా సమాచారం సేకరించేందుకు మాత్రమే చట్టబద్ధంగా నోటీసులు ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ విచారణను రాజకీయ కక్షగా చిత్రీకరించడం సరికాదని, ప్రజాస్వామ్యంలో ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు ఎలా దుర్వినియోగం అయ్యాయో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని జూపల్లి పేర్కొన్నారు. ప్రజల పన్నుల డబ్బుతో నడిచే భద్రతా వ్యవస్థలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవడం దిగజారుడుతనమేనని విమర్శించారు. మాజీ గవర్నర్ తమిళసై, ఐఏఎస్ ఆకునూరి మురళి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి వారి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని గతంలోనే ఆరోపణలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు, సూత్రధారులు ఎవరనేది తేల్చే వరకు ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు.
ముఖ్యంగా మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు వ్యవహారంపై జూపల్లి ప్రశ్నలు సంధించారు. కీలక సమయంలో ఆయన అమెరికాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని నిలదీశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన తిరిగి భారత్‌కు వచ్చారని, దర్యాప్తు సంస్థలకు సహకరించాల్సిందేనని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, గతంలో కోదండరామ్ వంటి నేతలను అక్రమంగా అరెస్ట్ చేసిన ఉదంతాలను గుర్తు చేస్తూ.. ఇప్పుడు జరుగుతున్న విచారణ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగుతోందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.









