ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగరి పర్యటనపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం నగరిలో సీఎం పర్యటించిన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రస్తుతం కనిపిస్తున్న అభివృద్ధి పనులన్నీ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని స్పష్టం చేశారు. నగరిలో కల్యాణమండపం, సబ్‌స్టేషన్, పాలిటెక్నిక్ కళాశాల, పార్కు, షాదీ మహల్ వంటి కీలక ప్రాజెక్టులన్నీ జగన్ ప్రభుత్వమే నిర్మించిందని, ఇప్పుడు చంద్రబాబు వచ్చి వాటిని తన ఖాతాలో వేసుకోవాలని చూడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ఉద్దేశించి రోజా మాట్లాడుతూ.. “చంద్రబాబు నగరిలో కేవలం డబ్బా కొట్టుకోవడం తప్ప నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా కొత్తగా ఇవ్వలేదు” అని విమర్శించారు. ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ పేరుతో రాష్ట్రాన్ని **’అప్పుల ఆంధ్ర, అరాచక ఆంధ్ర’**గా మార్చేశారని మండిపడ్డారు. నాలుగుసార్లు సీఎంగా చేసినా చంద్రబాబు నగరికి చేసిందేమీ లేదని, గతంలో గాలి ముద్దుకృష్ణమ నాయుడు హయాంలో జరిగిన అభివృద్ధి కూడా శూన్యమేనని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా నేతన్నలకు ఉచిత విద్యుత్ ఇస్తామని జీవో ఇచ్చి నేటికీ బడ్జెట్ విడుదల చేయకుండా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగరి ప్రభుత్వాసుపత్రిని సీఎం సందర్శించకపోవడం వెనుక అసలు కారణం అది వైసీపీ హయాంలో నిర్మించినందువల్లేనని, ఆ క్రెడిట్ జగన్‌కు వెళ్తుందనే భయంతోనే చంద్రబాబు అటువైపు వెళ్లలేదని రోజా వ్యాఖ్యానించారు. స్థానిక ఎమ్మెల్యే భాను ప్రకాశ్ పనితీరు శూన్యమని, ఆయనను సీఎం పొగడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం చెప్పే అబద్ధాలు వినలేకనే ప్రజలు సభకు దూరంగా ఉన్నారని, అందుకే కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయని ఆమె ఘాటుగా విమర్శించారు.









