వేదికపై అభిమాని అత్యుత్సాహం.. షారుఖ్ రియాక్షన్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తాజాగా సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన ‘జాయ్ అవార్డ్స్ 2026’ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన ఒక అవార్డును ప్రధానం చేయడానికి వేదికపైకి రాగా, ఒక అభిమాని నిబంధనలకు విరుద్ధంగా ఆయనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి తన ఫోన్‌ను బయటకు తీయగానే, షారుఖ్ ఖాన్ సున్నితంగా స్పందిస్తూ అతని చేతిలోని ఫోన్‌ను తీసుకున్నారు. ఈ చర్యతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
ఫోన్ లాక్కున్నారా? లేక ప్రొటోకాల్ పాటించారా? షారుఖ్ ఆ వ్యక్తి నుంచి ఫోన్ తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య పెద్ద చర్చ నడిచింది. అయితే, ఆయన ఆ ఫోన్‌ను కోపంతో లాక్కోలేదని, ఈవెంట్ ప్రొటోకాల్‌ను గుర్తు చేస్తూ నవ్వుతూనే ఆ చర్యకు పూనుకున్నారని స్పష్టమవుతోంది. అధికారిక ఫోటోగ్రాఫర్ల వైపు చూడాలని ఆ అభిమానికి సూచిస్తూ, కాసేపటి తర్వాత షారుఖ్ ఆ ఫోన్‌ను తిరిగి ఇచ్చేశారు. ఇంటర్నేషనల్ ఈవెంట్లలో వేదికపై వ్యక్తిగత సెల్ఫీలకు అనుమతి ఉండదని, అందుకే షారుఖ్ అలా చేశారని విశ్లేషకులు చెబుతున్నారు.
మద్దతుగా నిలుస్తున్న నెటిజన్లు ఈ ఘటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, మెజారిటీ నెటిజన్లు షారుఖ్ ఖాన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఒక అంతర్జాతీయ వేదికపై నిబంధనలను గౌరవించడం సెలబ్రిటీల బాధ్యత అని, షారుఖ్ ఖాన్ కేవలం తన పనిని తాను చేశారని కొనియాడుతున్నారు. “కింగ్ ఖాన్ ఎప్పుడూ తన అభిమానులను గౌరవిస్తారు, కానీ క్రమశిక్షణ కూడా ముఖ్యం” అని ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వేడుకలో షారుఖ్‌తో పాటు హాలీవుడ్ తారలు కేటీ పెర్రీ, మిల్లీ బాబీ బ్రౌన్ కూడా పాల్గొనడం విశేషం.









