సంక్రాంతి పండుగ వేళ చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో పండగ వాతావరణం నెలకొంది. భోగి పండుగ సందర్భంగా తన స్వగ్రామంలో ఉన్న విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం 81వ రోజు ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ను కలిసేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన లోకేష్, వారికి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ వినతులను స్వీకరించారు.
ఈ ప్రజాదర్బార్‌లో ప్రధానంగా భూవివాదాలు, ఇళ్ల స్థలాలు మరియు ఉద్యోగ సమస్యలపై విన్నపాలు వచ్చాయి. అన్నమయ్య జిల్లాకు చెందిన పత్తి శివకుమార్ తన వారసత్వ భూమి అన్యాక్రాంతమైందని ఫిర్యాదు చేయగా, తిరుమల అంగప్రదక్షిణ భక్తులకు ఆఫ్‌లైన్ టోకెన్ల జారీపై భక్త బృందాలు మంత్రిని కలిశాయి. అలాగే తిరుపతిలో నివసిస్తున్న ఎరుకల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, కచ్చరావేడు గ్రామంలో డ్రైనేజీ సమస్యలపై వినతులు అందాయి. టిటిడిలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు తమకు వైద్య సదుపాయాలు కల్పించాలని కోరగా, గత ప్రభుత్వంలో తొలగించిన 160 మంది స్టాటిస్టిక్స్ సూపర్ వైజర్లు తిరిగి తమకు ఉపాధి కల్పించాలని విన్నవించారు.
వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి లోకేష్, బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని భరోసా కల్పించారు. అనంతరం తనను కలవడానికి వచ్చిన చిన్నారులు, మహిళలు, వృద్ధులతో కలిసి ఆయన ఫోటోలు దిగారు. పండుగ పూట కూడా ప్రజల మధ్య ఉండి వారి కష్టాలను వినేందుకు లోకేష్ సమయం కేటాయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది.









