సంగారెడ్డి జిల్లా ఫసల్వాది ప్రాంతం వద్ద ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అవిదేశ్ (35) అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా, గాలిలో ఉన్న చైనా మాంజా ఒక్కసారిగా అతడి మెడకు చుట్టుకుంది. బైక్ వేగంగా ఉండటంతో ఆ నైలాన్ దారం అతడి గొంతును లోతుగా కోసేసింది. దీంతో తీవ్ర రక్తస్రావమై అవిదేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో ఈ మాంజా వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. నిజామాబాద్‌లో ఓ బాలుడికి మాంజా తగిలి 20 కుట్లు పడగా, హైదరాబాద్‌లో విధి నిర్వహణలో ఉన్న ఏఎస్‌ఐ నాగరాజు గొంతు కోసుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. గాలిపటాల పండుగ కేవలం సరదాగా ఉండాలి కానీ, ఇతరుల ప్రాణాలు తీసేలా ఉండకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పక్షుల రెక్కలు, మనుషుల మెడలు తెగ్గోసే ఈ దారం వాడటం నేరమని స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చైనా మాంజాపై పూర్తిస్థాయి నిషేధం విధించింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ మరియు సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ సోషల్ మీడియా వేదికగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నిషేధిత దారం అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. క్షణికానందం కోసం మరొకరి కుటుంబంలో విషాదాన్ని నింపవద్దని, కేవలం పత్తితో చేసిన దారాలను (కాటన్ మాంజా) మాత్రమే వాడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.









