తెలంగాణలో రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ట్రాఫిక్ చలాన్ల వసూలులో ఇకపై ఎలాంటి రాయితీలు ఉండబోవని స్పష్టం చేశారు. వాహనాల నంబర్ ప్లేట్లను నేరుగా వాహనదారుల బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయాలని, నిబంధనలు ఉల్లంఘించి చలాన్ పడగానే ఖాతా నుంచి డబ్బు కట్ అయ్యేలా సాంకేతికతను తీసుకురావాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
యుద్ధంలో సైనికుల మరణాల కంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం పట్ల సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు కేవలం జరిమానాలే కాకుండా, విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కఠినంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో సైబర్ క్రైమ్ మరియు డ్రగ్స్ కట్టడిలో తెలంగాణ పోలీసుల పనితీరును మెచ్చుకుంటూ, రోడ్డు భద్రతను కూడా అదే స్థాయిలో ప్రథమ ప్రాధాన్యతగా తీసుకోవాలని కోరారు.
హైదరాబాద్‌లోని చెరువుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ (HYDRAA) విభాగంపై సీఎం ప్రశంసల జల్లు కురిపించారు. హైడ్రా రాకతో జంట నగరాల శివార్లలోని అనేక చెరువులు, కుంటలకు మళ్ళీ జలకళ వచ్చిందని, ఆక్రమణల చెర నుంచి విముక్తి పొందిన చెరువుల వల్ల భూగర్భ జలాలు పెరుగుతున్నాయని కొనియాడారు. ప్రజలు కూడా హైడ్రాకు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, డీజీపీ శివధర్ రెడ్డి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.









