సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఈ ఏడాది ఆర్టీసీ బస్సుల్లో ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. సాధారణంగా పండుగ రద్దీ సమయంలో పెంచే అదనపు బాదుడు ఈసారి ఉండదని, మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా యథావిధిగా కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.
రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదే క్రమంలో ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీపై కూడా మంత్రి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అక్రమంగా ఛార్జీలు పెంచే ప్రైవేటు బస్సులపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వాటిని సీజ్ చేస్తామని తెలిపారు. ప్రయాణికులు తమ ఫిర్యాదులను తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ప్రభుత్వం కేటాయించింది.
మరోవైపు, రైలు ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే సైతం తీపి కబురు అందించింది. ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ – విశాఖపట్నం రూట్‌లో 12 జన్‌సాధారణ్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. వీటికి ముందస్తు రిజర్వేషన్ అవసరం లేదని, జనవరి 12 నుంచి 18 వరకు (జనవరి 15 మినహా) ఇవి అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రభుత్వాల ఈ నిర్ణయాలతో సామాన్యులకు పండుగ ప్రయాణం భారంగా మారకుండా ఊరట లభించింది.









