ఓఎన్జీసీ సైట్‌లో గ్యాస్ లీకేజీ: కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్జీసీ (ONGC) డ్రిల్లింగ్ సైట్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. మోరీ-5 బావి వద్ద గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఒక్కసారిగా లీకేజీ జరగడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీ శబ్దాలతో గ్యాస్ పైకి చిమ్మడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదం కారణంగా సమీపంలోని కొబ్బరి తోటలకు మంటలు అంటుకుని, సుమారు 500కు పైగా చెట్లు కాలిపోయినట్లు ప్రాథమిక అంచనా.
గ్రామం ఖాళీ.. సురక్షిత ప్రాంతాలకు తరలింపు: ప్రమాద తీవ్రతను గమనించిన రెవెన్యూ, పోలీస్ అధికారులు వెంటనే స్పందించి ఇరుసుమండ గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. ముందుజాగ్రత్త చర్యగా 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాజమండ్రి నుంచి వచ్చిన ఓఎన్జీసీ సాంకేతిక బృందాలు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉత్పత్తిని పెంచే పనుల క్రమంలోనే ఈ లీకేజీ సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష: ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు మరియు జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, మంటలను ఆర్పేందుకు ఓఎన్జీసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని మరియు ఘటనపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు.









