మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 4, 2026న (ఆదివారం) విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ వేడుకను తిరుపతిలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటానికి ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ తొలిసారి ఒకే సినిమాలో కనిపించడమే. వెంకటేష్ ఇందులో సుమారు 20 నిమిషాల నిడివి గల కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’ పాట 100 మిలియన్ల వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తుండగా, చిరు-వెంకీ కలిసి స్టెప్పులేసిన ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో దుమ్మురేపుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్‌లో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తున్నారు.
సినిమా ప్రమోషన్లను అనిల్ రావిపూడి ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. జనవరి 4న ట్రైలర్ రిలీజ్ తర్వాత, జనవరి 7న భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఓవర్సీస్ మార్కెట్‌లో, ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమై రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తున్నాయి. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.









