ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన నల్లమలసాగర్ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని హరీష్ రావు ఆరోపించారు. గతంలో ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టు పేరును ఇప్పుడు నల్లమలసాగర్ ప్రాజెక్టుగా మార్చారని, ఇది కేవలం పేరు మార్పు మాత్రమే తప్ప అసలు ఉద్దేశం తెలంగాణ నీటిని దొంగిలించడమేనని ఆయన మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూత్రధారి అయితే, తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి పాత్రధారిగా మారారని ఆయన విమర్శించారు.
నీటి పారుదల శాఖ సలహాదారుగా మాజీ అధికారి ఆదిత్యానాథ్ దాస్ నియామకాన్ని హరీష్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో ఏపీ సీఎస్‌గా ఉండి తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వందకు పైగా లేఖలు రాసిన వ్యక్తిని సలహాదారుగా పెట్టుకోవడం అంటే “దొంగకు తాళాలు ఇచ్చినట్లే” అని అభివర్ణించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి కీలక బాధ్యతలు ఇవ్వడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ఇది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు తమ నీటి వాటా కోసం పోరాడుతుంటే, రేవంత్ సర్కార్ మాత్రం ఏపీకి సహకరిస్తోందని ఆరోపించారు.
గోదావరి-కృష్ణా అనుసంధానం ద్వారా తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీల వాటాను ఏపీ అక్రమంగా తరలించుకుపోయే ప్రయత్నం చేస్తోందని హరీష్ రావు వివరించారు. గోదావరి నీటిని కృష్ణాలో కలుపకుండా నేరుగా పెన్నా బేసిన్‌కు తరలించడం ద్వారా తెలంగాణకు కృష్ణా నదిలో దక్కాల్సిన అదనపు నీటి వాటాను దక్కకుండా చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే, అసెంబ్లీలో నల్లమలసాగర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పక్షాన తామే మరో జల ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు.









