రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడేళ్లకు పైగా సాగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. డిసెంబర్ 23న రష్యా మరోసారి డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, దేశవ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని కోరుకునే వారందరిదీ ఒకే కోరిక అని, “అతను (పుతిన్) అంతమైపోవాలి” అని పరోక్షంగా పుతిన్ మరణాన్ని కోరుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్, శాంతి స్థాపన కోసం కొన్ని ప్రతిపాదనలను కూడా ముందుకు తెచ్చింది. రష్యా గనుక దాడులు ఆపి వెనక్కి తగ్గితే, తూర్పు ఉక్రెయిన్ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవడానికి సిద్ధమని జెలెన్‌స్కీ ప్రకటించారు. అయితే ఆ ప్రాంతం రష్యా ఆధీనంలో కాకుండా, అంతర్జాతీయ దళాల పర్యవేక్షణలో ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. రష్యాతో ఎలాంటి శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలన్నా, తుది నిర్ణయం మాత్రం తమ దేశ ప్రజలదేనని ఆయన స్పష్టం చేశారు.
సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ పోరులో రష్యా క్షిపణి దాడులు సాధారణ పౌరుల జీవనాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. పండగ పూట కూడా బాంబుల మోత మోగుతుండటంతో ఉక్రెయిన్ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రష్యా మొండివైఖరి వీడటం లేదని, అందుకే తాము రాజీలేని పోరాటం చేస్తున్నామని జెలెన్‌స్కీ పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ సమాజం మద్దతుతో రష్యా దురాక్రమణను అడ్డుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.









