తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 1:23 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్నాయి. ఈ ధనుర్మాసం జనవరి 14న ముగియనుంది. ఈ పవిత్ర మాసంలో స్వామివారికి విశేష కైంకర్యాలు నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సన్నాహాలు చేస్తోంది.
ఈ నెల 17వ తేదీ నుండి స్వామివారికి ప్రతి రోజు ఉదయం నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదించనున్నారు. ధనుర్మాసం ప్రారంభం రోజునే సుప్రభాతం సేవ రద్దు చేసి, తిరుప్పావై సేవను మొదలుపెట్టనున్నారు. తిరుప్పావై అనేది గోదాదేవి శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ రచించిన 30 పాశురాల సమాహారం.
ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన కూడా నిర్వహిస్తారు. అంతేకాకుండా, శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరు చిలుకలను ప్రతి రోజూ అలంకరిస్తారు. ఈ ధనుర్మాస ప్రత్యేక పూజల కారణంగా శ్రీవారి ఆలయంలో భక్తులకు లభించే సేవల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.









