కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర హోం శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ఆధారంగా, కేంద్ర ప్రభుత్వం ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.
ఈ ముప్పు హెచ్చరికల నేపథ్యంలో, శివరాజ్ సింగ్ చౌహాన్‌కు జెడ్ ప్లస్ (Z+) కేటగిరీ భద్రతను పటిష్టం చేశారు. ఈ భద్రతలో భాగంగా, 55 మంది శిక్షణ పొందిన భద్రతా సిబ్బందితో పాటు 10 మంది ఎన్ఎస్జీ (NSG) కమాండోలను మోహరించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని మధ్యప్రదేశ్ డీజీపీకి లేఖ ద్వారా తెలియజేస్తూ, ఐఎస్ఐ శివరాజ్ సింగ్ చౌహాన్‌పై దృష్టి పెట్టి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు పేర్కొంది. హెచ్చరికలు అందుకున్న వెంటనే భోపాల్‌లోని ఆయన నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లను మరింత బలపరిచారు.
ఇంతటి భద్రతాపరమైన ముప్పు ఉన్నప్పటికీ, శివరాజ్ సింగ్ చౌహాన్ తన రోజువారీ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా, ఆయన శనివారం భోపాల్‌లోని స్మార్ట్ సిటీ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలందరూ పచ్చదనం పెంచేందుకు తమతో కలిసి రావాలని పిలుపునిస్తూ, తాను ప్రతి రోజు మొక్కలు నాటాలని సంకల్పం తీసుకున్నట్లు ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.









